Congress | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఒక పార్టీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజీనామా చేయకుండానే మరో పార్టీలో చేరితే ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో సవరణ తీసుకొస్తాం.. ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హామీ. పాంచ్ న్యాయ్… పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఏఐసీసీ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ హామీ నెరవేర్చితే ప్రజలు వేసిన ఓట్లకు నిజమైన న్యాయం జరుగుతుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారే వారిపై వేటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించనట్టు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇప్పుడే అద్భుత మైన అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్‌లో చేరారు. వీరిని భయపెట్టో, ప్రలోభపెట్టో పార్టీలో చేర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒరిజినల్‌గా బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరినవారిపై కాంగ్రెస్ వేటు వేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకొనే అద్భుతమైన అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా దేశంలో కాంగ్రెస్ నిజాయితీని నిరూపించుకొని మిగతా రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలువొచ్చని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ గురివింద నీతి
లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్న కాంగ్రెస్ తన గురివింద నీతిని మరోసారి చాటుకున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని పరిస్థితులను చూస్తుంటే ఈ హామీ కేవలం మ్యానిఫెస్టోకే పరిమితమవడం ఖాయమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న కాంగ్రెస్..
ఇతర పార్టీల నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను, ఎంపీలను అడ్డగోలుగా చేర్చుకోవడంతోపాటు వారిలో కొందరిని రానున్న లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులుగా ప్రకటించింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఫిరాయింపుదారులపై అనర్హత వేటువేస్తామని నమ్మబలుకుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేనే స్వయంగా ఇటీవల పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్ తన పదవికి రాజీనామా చేయకముందే ఆయన మెడలో కాంగ్రెస్ కండువా కప్పారు.
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఖైరతాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తోపాటు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ‘అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్టుగా కాంగ్రెస్ అధిష్ఠానం ఏకంగా వీరిలో ఒకరిని సికింద్రాబాద్ నియోజకవర్గానికి, మరొకరిని చేవెళ్ల నియోజకవర్గానికి తమ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే ఎంపీ అభ్యర్థిగా ఎలా ప్రకటిసాస్తారని కాంగ్రెస్ నాయకులే విస్తుపోయారు.
ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ పీసీసీ ఆయననే సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌కు కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జిగా నియమించి, దానం నాగేందర్‌ను గెలిపించే బాధ్యతను అప్పగించడం కొసమెరుపు.
వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్కు రాజీనామా చేయకుండానే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం, వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లో చేరినట్టు సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించడం మరీ విడ్డూరం. ఇలా ఒకవైపు అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు రాజ్యాంగాన్ని సవరిస్తామని, ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేస్తామని చెప్పడం ‘దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు’గా ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.