హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మందబుద్ధితో రాష్ట్రంలో వైద్యారోగ్యం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నదని మాజీమంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ వందేండ్ల ముందుచూపుతో నగరానికి నలువైపులా టిమ్స్ దవాఖానలను నిర్మిస్తే, రేవంత్ ప్రభుత్వం వాటిని పూర్తిచేయకుండా రెండేండ్లుగా పడావు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం కాంగ్రెస్ దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు.
ఎల్బీనగర్లోని టిమ్స్ దవాఖానను మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పలువురు నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ర్టాన్ని గతంలో ఎంతోమంది పాలించినా నిజాం కాలంనాటి గాంధీ, ఉస్మానియా, కింగ్‌కోఠి దవాఖానలే ఉన్నాయని, కానీ కేసీఆర్ మాత్రం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు చేరువ చేసేలా నాలుగు టిమ్స్ దవాఖానలు, వరంగల్ హెల్త్ యూనివర్సిటీ పనులు ప్రారంభించి, నిధులు కేటాయించి దాదాపు పూర్తిచేశారని తెలిపారు. కాంగ్రెస్ కక్ష సాధింపుతో పూర్తిచేయడం లేదని విమర్శించారు.
కరోనాను మించిన మహమ్మారి వచ్చినా ఎదుర్కొనేలా కేసీఆర్ ప్రణాళికలు రచించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ దవాఖానలను పూర్తిచేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే రేవంత్ ప్రభుత్వం టిమ్స్ దవాఖాన పనుల్లో జాప్యం చేస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఉండేలా ప్లాన్ చేశారని, 2,850 మెడికల్ సీట్లను 10 వేలకు పెంచారని గుర్తుచేశారు. మహేశ్వరం మెడికల్ కాలేజీని ఎల్బీనగర్ టిమ్స్‌లో, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీని అల్వాల్ టిమ్స్‌లో విలీనం చేసి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు.
ప్రజారోగ్యానికి కీలకమైన దవాఖానలపై రాజకీయాలు పక్కనపెట్టి వాటిని త్వరగా పూర్తిచేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అవసరమైతే తమపై కేసులు పెట్టుకోవాలని, కానీ వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ దవాఖానలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కోరారు. ఆరు మాసాల్లో టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ పూర్తి చేయకపోతే తెలంగాణలో మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వ్యక్తిగత రాజకీయాల కోసం దవాఖానల నిర్మాణం ఆపడం సరికాదనీ, టిమ్స్ నిర్మాణాలపై డెడ్లైన్లు, డేట్లు మారుతున్నాయే తప్ప నిర్మాణాలు మారడం లేదని విమర్శించారు.
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డికి తిట్లపై ఉన్న శ్రద్ధ ప్రజల మేలు కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిట్లపై లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్‌తో పాటు పలు రకాల సేవలను కేసీఆర్ ప్ర వేశపెడితే రేవంత్‌రెడ్డి వాటిని పక్కనపెట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30శాతం నుంచి 72 శాతానికి పెరిగినట్టు గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఇది మళ్లీ 55శాతానికి తగ్గిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో వైద్యం, విద్య, జీఎస్టీ వృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలు తిరోగమనంలో ఉన్నాయని, ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
బస్తీ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా కేసీఆర్ ప్రభుత్వం 450 బస్తీ దవాఖానలను ప్రారంభించిందని హరీశ్‌రావు తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, 15వ ఆర్థిక సంఘం కూడా దీనిని ప్రశంసించిందని తెలిపారు. కానీ, రేవంత్‌రెడ్డి పుణ్యానా బస్తీ దవాఖానలకు సుస్తీ చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. బస్తీ దవాఖానాల్లో సరిగా జీతాలు రావడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద రూ. 8 వేల కోట్లు, సీఎంఆర్ఎఫ్ కింద రూ. 3 వేల కోట్లు మొత్తంగా రూ. 11 వేల కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రూ. 1,400 కోట్ల బకాయిలతో పేదలకు వైద్యం అందడమే లేదని పేర్కొన్నారు.
తెలంగాణలో ‘కంటి వెలుగు’ అనే అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తే రేవంత్‌రెడ్డి దాన్ని బంద్ పెట్టారని హరీశ్‌రావు అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి కంటి వెలుగు పథకాన్ని వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడకుండా వెంటనే టిమ్స్ దవాఖానలను, వరంగల్ హెల్త్ సిటీని పూర్తి చేయాలని, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని, బస్తీ దావఖాన డాక్టర్లు, సిబ్బంది జీతాలు చెల్లించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై. సతీశ్‌రెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, భవానీ ప్రవీణ్‌కుమార్, జిటా ్టరాజశేఖర్రెడ్డి, రమావత్ పద్మా నాయక్, డివిజన్ల అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, లింగాల రాహుల్‌గౌడ్, తోట మహేశ్‌యాదవ్, జక్కల శ్రీశైలం యాదవ్, వరప్రసాద్‌రెడ్డి, చెరుకు ప్రశాంత్ గౌడ్, రమేశ్ ముదిరాజ్, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, టంగుటూరి నాగరా జు, జక్కిడి రఘువీర్‌రెడ్డి, తిలక్‌రావు, పార్శపు శ్రీధర్, తోట వెంకటేశ్వర్లు, సుంకోజు కృష్ణమాచారి, రాం నర్సింహా గౌడ్, భాస్కర్ గంగపుత్ర, పాండుగౌడ్, ఉదయ్‌గౌడ్, కొండల్‌రెడ్డి, అరవింద్‌శర్మ, విజయలక్ష్మి, రూపాసింగ్, పద్మ, రంగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ: పాలన గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కేసీఆర్ సంక్షేమానికి, అభివృద్ధ్దికి ప్రాధాన్యమిచ్చి పాలిస్తే, రేవంత్‌రెడ్డి చెత్త విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో రాష్ర్టాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు.
విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, అందరినీ మోసం చేశారని దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రామ పంచాయతీలు సమస్యలకు నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో అ త్యధిక కేంద్ర ప్రభుత్వ ఆవార్డులు సాంధించిన తెలంగాణ గ్రామ పంచాయతీలు, నేడు నిధులు లేక కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పల్లెప్రగతిలో కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే దిక్కుకుండా పోయిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి పనిచేసి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.