రామగుండం (జ్యోతినగర్), జనవరి 28 : రామగుండం ఎన్టీపీసీలో ఫేజ్-2 కింద 2400 మెగావాట్ల సామర్థ్యంగల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపన కోసం మంగళవారం ఎన్టీపీసీలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ బందోబస్తు మధ్య సాగింది. ఎన్టీపీసీ భూ నిర్వాసితుల పక్షాన న్యాయం కోసం పోరాడుతామని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన తర్వాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఎన్టీపీసీ పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా ప్రభావిత గ్రామాల్లోని బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణం గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కోరుకంటి చందర్, నాయకులను గేట్ వద్దే అరెస్ట్ చేసి, జైపూర్ పోలీస్టేషన్‌కు తరలించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడంతో ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల తరఫున మాట్లాడేవారు లేకుండా పోయారు. ప్రజాభిప్రాయ సేకరణలో అరెస్ట్‌లు ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటు కోసం భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాడుతాం. భూనిర్వాసితుల పక్షాన ఎన్టీపీసీ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాం. ప్రజాభిప్రాయ సేకరణలో నిర్వాసితుల గొంతుగా అభిప్రాయం వ్యక్తం చేసేందుకు వెళ్తున్న క్రమంలో అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. భూ నిర్వాసితుల కుటుంబాల జీవితాలను చీకటి మయం చేసిన ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి. సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయాలి. ప్రభావిత గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. నిర్వాసితుల డిమాండ్లను పూర్తిస్థాయిలో అమలు చేసేవరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది.
– కోరుకంటి చందర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే