హనుమకొండ సబర్బన్, మార్చి 26 : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సభను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, హుస్నాబాద్, నర్సంపేట మా జీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎల్కతుర్తిలో పర్యటించారు. సిద్దిపేట రోడ్డుకు ఇరువైపులా స్థలాలను పరిశీలించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సభ ఏర్పాట్లు మొదలుకొని, పూర్తయ్యే వరకు ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని వినయ్‌భాస్కర్ సూచించారు. చరిత్రాత్మకమైన ఈ మహాసభకు స్థానిక ప్రజలతో పాటు రైతులు సహకరించాలని కోరారు. సభకు వచ్చే పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్టు ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని కార్యకర్తలను కోరారు. సర్వేయర్లతో డ్రోన్ల ద్వారా ప్రతిపాదిత స్థలాన్ని చిత్రీకరించి మ్యా పింగ్ చేయించారు.