హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సర్దార్ది ఆత్మహత్య కాదని, ప్రేరేపిత హత్య అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బుధవారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. సర్దార్ది సాధారణ ఆత్మహత్య కాదని కాంగ్రె స్ నాయకుల కుట్రలతో ప్రేరేపితమైన హత్య గా భావించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ను జూబ్లీహిల్స్ పరిధిలో బలహీనపర్చేందుకు కాంగ్రెస్ నేతలు పన్నిన కుట్రలో భాగంగా సర్దార్, కృష్ణమోహన్, ఫయాజ్ లాంటి పార్టీ నాయకులపై కుతంత్రాలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
సర్దార్ పార్టీ మారేందుకు నిరాకరించడంతోనే ఆయన మెడికల్ షాప్‌పై డ్రగ్ కంట్రోల్ అధికారులతో రైడ్లు చేయించారని ఆరోపించారు. దీంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని వివరించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే నగర సీపీ దృష్టికి తీసుకెళ్లిన ట్టు తెలిపారు. క్షుద్రపూజలు చేసి మాగంటి గోపినాథ్‌ను చంపానని, నీక్కూడా అదే గతి పడుతుందని రహ్మత్‌నగర్‌కు చెంది న నర్సింహారెడ్డిని సంధ్య కన్వెన్సన్కు చెందిన శ్రీధర్‌రావు బెదిరించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇటువంటి బహిరంగ బెదిరింపులపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపి, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.