హైదరాబాద్/నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 29: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్‌తోపాటు దాదాపు అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పాలన చేతకాక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్‌రెడ్డి సిట్ నోటీసులు అంటూ డ్రామా ఆడుతున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తున్నదని విమ్శంచారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.

హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్ సమీపంలోని ఆగ్రసేన్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ నేత లు కురువ విజయ్‌కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, సుమిత్రా ఆనంద్, బొమ్మెర రామ్మూర్తి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ ను దహనంచేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చేపట్టిన నిరసనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఇక్కడ ఎర్రబెల్లిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో, ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో, నారాయణపేట జిల్లా మక్తల్‌లో మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రేవం త్ దిష్టిబొమ్మను దహనంచేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిరసన తెలిపారు. సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రాణాలకు తెగించి, తెలంగాణ జాతిని ఏకం చేసి, రాష్ర్టాన్ని సాధించి, దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్‌కు సిట్ నోటీసుల పేరిట కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు.

తెలంగాణ ద్రోహి, ప్రజా విశ్వాసఘాతకుడు, అర్బకుడు, అసమర్థుడు, పరిపాలన చేత కాక రెండున్నరేండ్లుగా తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న మూర్ఖుడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. తన అసమర్థతను అవినీతిని అరాచకాన్ని కప్పి పుచ్చుకోవడానికి పాల్పడుతున్న దుశ్చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తున్నదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వపు దుర్మార్గపు చేష్టలన్నీ కాంగ్రెస్ పాలిట మరణశాసనం కాకతప్పదని హెచ్చరించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వ శిఖరం కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ క్రీడ అత్యంత హేయమైనదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కేసీఆర్ అని, ఆయన్ని తాకాలని చూడటం రేవంత్ అవివేకమని మండిపడ్డారు. ఈ దుర్మార్గ రాజకీయాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నదని పేర్కొన్నారు.

నేడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన బొగ్గు కుంభకోణం సెగలు ప్రభుత్వం దాకా రాకుండా ఉండటానికే, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఇది పక్కాగా ప్రజల దృష్టిని మళ్లించే కుతంత్రం అని, ప్రజాక్షేత్రంలో ఉన్నతంగా నిలిచిన నాయకుడిని ఇలాంటి నోటీసులతో కించపరచలేరని పేర్కొన్నారు. అధికారం అనేది సమస్యల పరిష్కారానికి వాడాలి తప్ప, ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు కాదని హితవు పలికారు. సత్యం ఎల్లప్పుడు నిలకడగా ఉంటుంది అని దేశపతి పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పిలువడం తీవ్ర శోచనీయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవి చంద్ర పేర్కొన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని, సిట్ విచారణ టీవీ సీరియల్స్‌ను తలపిస్తున్నదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పాలకులు ఘోరంగా విఫలంకావడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.

అవినీతిలో కూరుకుపోయి, కుంభ కోణాల మయమైన రేవంత్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో ఉంది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమేకాక పదేండ్లు సుపరిపాలన చేసి, రాష్ర్టాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్‌పై చేస్తున్న దుర్మార్గ ప్రచారంలో భాగమే ఈ నోటీసులు అని విమర్శించారు. ఎన్ని కుట్రలు, డైవర్షన్లు చే సినా ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై ఉద్యమం చేస్తామని తేల్చిచెప్పారు.
ప్రాణాన్ని పణంగా పెట్టి కోట్లాది మంది ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షల్ని నెరవేర్చిన తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తిని దిగజార్చే కుట్రలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెరలేపింది అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ విమర్శించారు.
ఉద్యమనేతకు
ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి, చట్టాలు, న్యాయవ్యవస్థపై పూర్తిగా నమ్మకమున్న కేసీఆర్, ఇలాంటి తప్పుడు చర్యలకు ఏమాత్రం భయపడరనే విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ గుర్తుంచుకోవాలి అని పేర్కొన్నారు. ఇప్పటికైనా తప్పుడు పద్ధతులకు స్వస్తి పలికి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మీద దృష్టి సారించాలని సూచించారు.
హనుమకొండ, జనవరి 29 : మున్సిపల్ ఎన్నికల వేళ డైవర్షన్ రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం డైలీ సీరియల్లా నడుపుతున్నదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో డైవర్షన్ తప్ప పరిపాలన లేదని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొకి, కేవలం ప్రతీకార రాజకీయాలనే కొనసాగిస్తున్నదని తెలిపారు. తెలంగాణ తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నాయకుడికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని, మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం మూర్ఖత్వం అని, మున్సిపల్ ఎన్ని కల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి చిత్తు చిత్తుగా ఓడిస్తాం అని హెచ్చరించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను విచారణ పేరుతో వేధించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచే బీఆర్ఎస్ నాయకత్వాన్ని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలని కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు.

ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు తదితర నాయకులను విచారణ పేరుతో పిలిచిన ప్రభుత్వం, ఇప్పుడు కేసీఆర్‌ను కూడా పిలువడం రాజకీయ కక్ష సాధింపే అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన పతనాన్ని తానే కోరుకుంటున్నదని ఆరోపించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మ హానేతను రాజకీయ కక్షతో ఇబ్బందులకు గురిచేయాలనే ప్రయత్నాలు చివరికి కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీస్తాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

దావోస్ పర్యటనలో ఎన్ని పెట్టబడులు తెచ్చావని ప్రశ్నిస్తారనే భయంతో ముందుగానే ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు రేవంత్‌రెడ్డి ఫోన్‌ట్యాపింగ్ పేరుతో సిట్ విచారణ చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌కుమార్‌లను విచారించిన సిట్, తాజాగా కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని కర్నె తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్ట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెబ్‌సిరీస్ లాగా ఒక రాజకీయ నాటకాన్ని నడుపుతున్నదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్‌బిగాల గురువారం విమర్శించారు.

రోజుకు ఒకరికి నోటీసులు ఇస్తూ కేసీఆర్ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్రంలో తన నాయకులు ఏదో చేస్తారనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సమస్య లు పరిష్కరించకుండా, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ జాతిపిత, రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్కూర్మాచలం తీవ్రంగా ఖండించారు.

తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపి ప్రజలంతా గర్వించేలా చేసిన నాయకుడిని అగౌరపరచి, ఇబ్బందులు పెట్టడాన్ని ఎన్నారైలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక కక్ష సాధింపులతో కాలాన్ని గడుపుతున్నదని విమర్శించారు. ఇలాంటి నోటీసులతో కేసీఆర్‌ను ఏమీ చేయలేరని చెప్పారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ బాపూ కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే.. తెలంగాణ ప్రభుత్వం సోయి తప్పి తప్పటడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుందని బీఆర్ఎస్ యూఎస్ఏ చైర్మన్ తన్నీరు మహేశ్ అన్నారు.

కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే కోట్లాది తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే అని తెలిపారు. తెలంగాణ ఆత్మ, అస్తిత్వంపై అమరావతి నుంచి దాడి జరిగినట్టు కనిపిస్తున్నదని తెలిపారు. ప్రతి పక్షాలను వేధించడమే ధ్యేయంగా సీఎం రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణకోసం హైదరాబాద్ రావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్ఐటీ) కోరడం చట్టవిరుద్ధమని, ఆ నోటీసు చెల్లుబాటు కాదని సీనియర్ న్యాయవాది రచనారెడ్డి స్పష్టంచేశారు.

సీఆర్పీసీ-160, బీఎన్ఎస్ఎస్-169 చట్టాల ప్రకారం 65 సంవత్సరాలకన్నా ఎక్కువ వయసు ఉన్నవారిని ఫలానా జ్యూరిస్డిక్షన్ పరిధిలో విచారణకు రావాలని పిలువడం చట్ట విరుద్ధమని, వారి సౌకర్యానికి అనుగుణంగా వారు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి విచారించాలని ఆమె పేర్కొన్నారు. గురువారం సిట్ జారీచేసిన నోటీసులో కేసీఆర్‌ను హైదరాబాద్ రావాలని పేర్కొన్నారని, చట్ట ప్రకారం ఆ నోటీసు చెల్లుబాటుకాదని చెప్పారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఉద్యమనేతగా కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆయన గాంధీభవన్‌లో గురువారం స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని అందుకే ఆయనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవాలు బహిర్గతం కావాలని ఎం పీ మల్లు రవి తెలిపారు. ఆనాటి ప్రభుత్వ నిర్ణయం మేరకే అధికారులు ట్యాపింగ్ చేసినట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

19
వాస్తవాలు తెలిసే వరకు ఎవర్నీ దోషులని భావించలేమని స్పష్టం చేశారు.