నెల్లికుదురు, మే 13 : డబ్బులిచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన వారికి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ బీఆర్ఎస్ నాయకులు, రైతులు 90 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామం నుంచి నెల్లికుదురుకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎంపీడీవో బాలరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లాని నవీన్‌రావు మాట్లాడుతూ.. డబ్బులిచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని, లబ్ధిదారుల ఎంపికలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు, రైతులు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తమ కార్యకర్తలు, అనుచరులకే ఇండ్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి 20 రోజులు గడిచినా కాంటాలు పెట్టే పరిస్థితి లేదని మండిపడ్డారు. కాంటాలు పెట్టినా లారీలు లేక ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంటున్నాయని పేర్కొన్నారు.