హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో యథేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, బాధ్యులైన పాలకులు, అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. లచగర్ల బాధితులతో కలిసి మంగళవారం జాతీయ మానవ హకుల కమిషన్ చైర్మన్ జస్టిస్ రామ సుబ్రహ్మణియన్‌కు ఫిర్యాదు చేశారు. లగచర్లలో అన్యాయంగా ఎస్టీల భూములు లాకొని, మహిళలను కొట్టి, రైతులను జైలుకు పంపారని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, పెద్దసంఖ్యలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయని వివరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ జైలుకు పంపారని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్షానికి శాపంగా మారిందని బీఆర్ఎస్ నేతలు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌కు తెలిపారు. ప్రతిపక్ష నాయకులు తమకు జరిగిన అన్యాయాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని వాపోయారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదులను కూడా నమోదు చేయకుండా కాంగ్రెస్ నాయకుల కేసులను మాత్రం పరువు నష్టం కింద నమోదు చేస్తున్నారని చెప్పారు. సంబంధం లేకున్నా బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ సతీమణికి పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు. సెర్చ్ వారెంట్ లేకున్నా సామ్రాట్ ఇంట్లో దౌర్జన్యంగా చొరబడి, గర్భిణులను నెట్టేసి, సోదాలు చేశారని, సోషల్ మీడియాలో కేవలం రీ ట్వీట్ చేసినందుకు నల్ల బాలు (శశిధర్‌గౌడ్) అనే ట్విట్టర్ హ్యాండిల్ ఉన్న వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని తెలిపారు.
తెలంగాణలో పాలకులు రాజ్యాంగం, బీఎన్ఎస్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక, ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరించడాన్ని నిరోధించాలని, శాంతి భద్రతలను కాపాడాలని, మహిళలు, పిల్లల అరెస్టు, తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించాలని, వెంటనే మానవ హకుల కమిషన్ అధికారులతో కమిటీ వేసి బాధితులను కలిసి వివరాలు సేకరించాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో సుమారు 100 మంది విద్యార్థులు హాస్టళ్లలో మరణించారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. విద్యార్థుల మరణాలపై న్యాయ విచారణ జరపాలని కోరగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని మండిపడ్డారు. లగచర్ల అంశంపై గతంలో ఢిల్లీలో ఫిర్యాదు చేశామని, ఆ తర్వాత వాళ్లు వచ్చి ఇక్కడ విచారణ చేశారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చెప్పారు. కానీ నేటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్‌లోకి రాకపోతే హత్యాయత్నం కేసులు పెట్టిస్తున్నారన్న విషయాన్ని వివరించామని తెలిపారు.
లగచర్ల భూసేకరణ విషయంలో గిరిజన, దళితులను ఇబ్బందులకు గురిచేసిన వారిని శిక్షించాలని కమిషన్‌ను ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు. తెలంగాణలో పోలీసులను రేవంత్‌రెడ్డి ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్నారని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, అసలు నేరాలను గాలికి వదిలేశారని విమర్శించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని, తెలంగాణను పోలీ సు రాజ్యంగా మార్చుతున్నారని మం డిపడ్డారు. ఈ అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కమిషన్ ఆదేశించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు కల్యాణరావు, కిరణ్‌కుమార్‌గౌడ్, లక్ష్మణ్, బీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగబాలు పాల్గొన్నారు.