చండ్రుగొండ, జూలై 24: రైతులందరికీ బేషరతుగా పంట రుణాలు మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత రైతులకు ఎలాంటి కొర్రీలు పెట్టొద్దని సూచించారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో రుణమాఫీ కాని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సహకార సంఘాల్లో, బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాస్బుక్తోనేగాక పహాణీలతో తీసుకున్న పంట రుణాలను కూడా మాఫీ చేయాలని కోరారు. పట్టా బుక్కులు, రేషన్‌కార్డులు లేవనే సాకుతో రైతులకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువమంది రైతులు పహాణీలతోనే పంట రుణాలు తీసుకున్నందున వారందరికీ రుణమాఫీని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతుభరోసాను కూడా వెంటనే అందించాలని సూచించారు. అనంతరం ఆర్ఐ అక్బర్‌కు వినతిపత్రం సమర్పించారు.