భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆ పార్టీ నాయకులు తేల్చి చెప్పారు. రహదారులు పూర్తిగా ధ్వంసమై ప్ర మాదాలకు నిలయంగా మారాయని, ప్రయాణికులు ప్రాణాలు సైతం కోల్పోతున్నా పట్టించుకోరా? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డా రు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఇల్లెందులో సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడించారు. జేకే సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రమిచ్చారు. కొత్తగూడెంలో జిల్లా నాయకుడు మంతపురి రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ముట్టడించారు. ఆళ్లపల్లిలో మాజీ జడ్పీటీసీ హనుమంతరావు, మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారావు, బూర్గంపహాడ్‌లో మండ ల పార్టీ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, కరకగూడెంలో మండల పార్టీ అధ్యక్షుడు రావుల సోమయ్య, పినపాకలో బీఆర్ఎస్ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.