అచ్చంపేట, ఆగస్టు 6 : అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేస్తామని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశానికి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం వల్ల ఎలాంటి నష్టంలేదని, సమిష్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకుంటామని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, గ్రామాల్లో ఎవరిని కదిలించినా కేసీఆర్ పేరునే తలుస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటుతుందని ధీమా వ్యక్తంచేశారు. గువ్వల ఎవరితో సంప్రదించకుండా పార్టీకి రాజీనామా చేయడం సరికాదని అన్నారు. ఈనెల 8న అచ్చంపేటకు మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తున్నారని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు పోకల మనోహర్ తెలిపారు. గువ్వల తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళ్లిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నాయకులు, కార్యకర్తలంతా పార్టీకోసం పనిచేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తామని, గువ్వల వెళ్లిపోయినంత మాత్రన బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అచ్చంపేట నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఎవరిని ఇన్చార్జిగా నియమించినా అందరం కలిసిట్టుగా పనిచేస్తామని ప్రకటించారు.
పార్టీని మరింత బలోపేతం చేస్తాం
అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. కాం గ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలతో ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక ఎన్నికలు వస్తున్న తరుణంలో మాజీ ఎమ్మె ల్యే గువ్వల పార్టీని వీడటం మాకు బాధ కలిగింది. ఎందుకు రాజీనామా చేశారో మాకు తెల్వదు. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– నర్సయ్యయాదవ్, సింగిల్‌విండో చైర్మన్, నాగర్‌కర్నూల్ జిల్లా
మేము కేసీఆర్ వెంటే ఉంటం
మేము 2001 నుం చి కేసీఆర్ వెంటే ఉ న్నాం. ఇప్పుడు గువ్వల బాలరాజు లాంటి వ్యక్తులు వచ్చిపోతుంటరు. కానీ మేము కేసీఆర్ వెంటే ఉంటామని తీర్మానం చేసినం. గువ్వల వెళ్లినంత మాత్రాన మేము వెళ్లాల్సిన అవసరం లేదు. గులాబీ పార్టీలోనే ఉంటూ ప్రజలకు సేవలందిస్తాం.
– కోనేటి తిరుపతయ్య, లింగాల మాజీ సర్పంచ్, నాగర్‌కర్నూల్ జిల్లా
బీఆర్ఎస్ కోసం పనిచేస్తాం
అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ వీడటం వల్ల క్యాడర్ ఆందోళనకు గురికాకుండా మండలానికి పదిమంది చొప్పున ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ ఈ సమావేశానికి మండలాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో తరలివచ్చి అందరం బీఆర్ఎస్లోనే ఉంటామని ప్రకటించారు. పార్టీలోకి వ్యక్తులు వస్తుంటరు, పోతుంటరు. కానీ వ్యవస్థ, పార్టీ ఉంటుంది. మాజీ మంత్రి హరీశ్‌రావును పిలిపించి అచ్చంపేటలో నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుంటం.
– నర్సింహాగౌడ్, అచ్చంపేట మాజీ మున్సిపల్ చైర్మన్, నాగర్‌కర్నూల్ జిల్లా