తిరుమలాయపాలెం, ఆగస్టు 23: భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి పాలేరు నీటిని విడుదల చేసి స్థానిక చెరువులు నింపి ఆయకట్టుకు అందించాలని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు ఇస్లావత్‌తండా సమీపంలోని భక్తరామదాసు ప్రాజెక్టు పంప్‌హౌస్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం సమీపంలోని ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాట్లాడుతూ.. కర్షకులు కరువు కోరల్లో విలవిల్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించడంలేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు.
ఇందుకోసం పాలేరు రిజర్వాయర్ నుంచి భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని విడుదల చేసి, ఆయకట్టు కింద ఉన్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలోని కర్షకుల కన్నీళ్లు మంత్రి పొంగులేటికి ఎందుకు కన్పించడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీళ్లు విడుదల చేయకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకోతో ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో పోలీసులు వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. అధికారులతో చర్చించి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.