ఖమ్మం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు, అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. ఎన్నికల హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని మండిపడ్డారు. తాము తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీలో అడుగు పెట్టనీయబోమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాల నుంచి తమ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసని స్పష్టంచేశారు. అక్రమ కేసులు, తప్పుడు కేసులు బనాయించి బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టలేరని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నాయకులు, మంత్రి పొంగులేటి అనుచరులు, వారి ప్రోద్బలంతో పోలీసుల వేధింపులను తాళలేక బీఆర్ఎస్ తిరుమలాయపాలెం మండల ఉపాధ్యక్షుడు, పార్టీ సోషల్ మీడియా విభాగం మండల అధ్యక్షుడు బానోత్ రవి (ఆర్మీ రవి) సోమవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, బానోత్ చంద్రావతి, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి వద్దిరాజు, తాతా మధు మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో కొంతమంది పోలీసులు, అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, అధికారులమనే విషయాన్ని పక్కనబెట్టి మంత్రుల అనుచరుల ఆదేశాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
దయాకర్‌రెడ్డి నాలుగో మంత్రా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకు తోడు అదనంగా తుంబూరు దయాకర్‌రెడ్డి నాలుగో మంత్రిగా వ్యవహరిస్తున్నారని వద్దిరాజు, తాతా మధు ఆరోపించారు. ఈ నలుగురి ప్రోత్సాహం, ప్రోల్బదంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుంబూరు దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రామసహాయం నరేశ్‌రెడ్డి, రమేశ్, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, తిరుమలాయపాలం ఎస్సై జగదీశ్ పక్కా ప్రణాళిక ప్రకారమే రవిని వేధించారని, అతడిపై కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. వీటిపై ఉన్నతాధికారులు వెంటనే విచారించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అలాగే.. దయాకర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, రమేశ్‌లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న, అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు ఖమ్మంలో సీపీ సునీల్‌దత్‌కు వినతిపత్రం అందజేశారు.