Y Satish Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు ప్రాధాన్యత ధాన్యపు రాశులా..? లేకపోతే అందాల రాశులా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం రోజు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణలో అందాల పోటీ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారన్న ఆయన… పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వారం రోజులపాటు నిర్వహించిన ఈ మొబిలిటీ వీక్ ఫార్ములా ఈ రేస్పై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మిందన్నారు. ఫార్ములా ఈ రేస్ జరగడానికి వారం రోజుల ముందే రూ. 40 కోట్ల ఖర్చతో వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది, అప్పటి మంత్రి కేటీఆర్దని తెలిపారు. కానీ.. కేటీఆర్కు, గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో ఫార్ములా రేసు మళ్లీ రాష్ట్రానికి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు.
కానీ ఇదే కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక రూ. 200 కోట్లు ఖర్చుపెట్టి అందాల పోటీలు నిర్వహిస్తుంనిదని వీటి ద్వారా ఇప్పటివరకు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి వచ్చాయా సతీష్ రెడ్డి ప్రశ్నించారు. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకుండా లక్ష రూపాయలకు ప్లేటు చొప్పున భోజనం అందాల భామలకు వడ్డిస్తూ తెలంగాణ ప్రజల విలువైన సొమ్మును వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గుజరాత్లో ట్రంప్ వచ్చినప్పుడు అడ్డుగోడలు కట్టినట్టు ఇప్పుడు వీధి వ్యాపారులను తొలగించి వారి జీవితాన్ని రోడ్డుపాలు చేసి పిల్లల భామలను రామప్ప తీసుకెళ్లారని అన్నారు. ఇప్పుడు
రూ.200 కోట్లు ఎవరికి కావాలి ..? ఫార్మర్కి కావాలా..? ఫ్యాషన్ కి కావాలా..? ఇబ్బందులు పడుతున్న రైతులకు కావాలా..? సర్కారు ప్రాధాన్యత ఏంటి అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో కల్లాల్లో పంటలు దెబ్బతిని వరదలో వడ్లు కొట్టుకపోతుంటే ఆడబిడ్డలు కన్నీళ్లు పెడుతున్నా.. ఏ ఒక్క మంత్రి కూడా అటువైపు కన్నెత్తి చేసిన పాపాలు పోవడం లేదన్నారు. ములుగు జిల్లాలో 200 ఎకరాల్లో పంట నీటిపాలై రైతులు ఏడుస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క రైతులను పరామర్శించకుండా అందాల పోటీల పేరుతో వారితో తిరుగుతూ జల్సాలు చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పనిచేయక తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం నడుస్తున్నారని… వారిని పట్టించుకునే తీరిక.. వారి కోసం డబ్బులు ఖర్చు పెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఓవైపు రైతులు ఆడబిడ్డ లేడుస్తుంటే వారిని పట్టించుకోకుండా అందగత్తెలను బస్సుల్లో తిప్పుకుంటూ వారికి డిన్నర్ ఇస్తూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. అదే రూ. 200 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటివరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేసేదో ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని అన్నారు. తెలంగాణ సొమ్ము ఎవరికోసమో ప్రజలు ఆలోచించాలని వై సతీష్ రెడ్డి కోరారు.