హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): భారతీయ న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సంహిత-2023 చట్టాల అమలును నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
ఈ మూడు చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయాలన్న నిర్ణయాన్ని నిలిపివేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్కు లేఖలు రాశారు. కొత్త చట్టాలకు హిందీ పేర్లు పెట్టడాన్ని వినోద్‌కుమార్ తప్పుబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 ప్రకారం చట్టాలను కచ్చితంగా ఇంగ్ల్లిష్లోనే డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాకుండా, హిందీయేతర రాష్ర్టాలకు ఇబ్బందులు కలిగిస్తుందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్టాల పేర్లను కచ్చితంగా ఇంగ్లిష్‌లోకి అనువదించి, దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడు చట్టాలు న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న అనేక రంగాలపై, సామాన్య ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని తెలిపారు. కొత్త చట్టాలను రూపొందించే క్రమంలో సంబంధిత వర్గాలతో సంప్రదింపులు సరిగా జరగలేదని అభ్యంతరం వ్యక్తంచేశారు.
కొత్త చట్టాల ద్వారా పోలీసులకు అపరిమిత అధికారాలు ఇవ్వడం, సంకెళ్లను వాడటం, డిటెన్షన్ సమయాన్ని పొడిగించడం వంటివి దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. డిజిటల్ ఆధారాలను పరిగణనలోకి తీసుకొనే విషయంలో వ్యక్తిగత డాటా గోప్యతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంలో సరైన జ్యుడీషియల్ పర్యవేక్షణ లేకుండానే లా ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకు మోతాదుకు మించి అధికారాలు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇది ఏకపక్షంగా అరెస్టులు, డిటెన్షన్లు వంటివాటికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
మరోసారి సమీక్షించండి
కొత్త చట్టాలకు హిందీ పేర్లు పెట్టడంపై కేరళ హైకోర్టులో ఇప్పటికే ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైందని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. న్యాయ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా హక్కులు, కస్టడీలో వేధింపులు వంటి ముఖ్యమైన అంశాల్లో ఈ చట్టాలు పరిష్కారం చూపడం లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం కొత్త చట్టాలను మరోసారి సమీక్షించి మరింత సమగ్రంగా, సరైన పద్ధతిలో సంస్కరణలు చేయాలని కోరారు. ఈ చట్టాలను 2020లోనే అమలు చేయాలని భావించినా, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు.