కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 4: మంత్రి పదవిలో ఉన్న పొన్నం ప్రభాకర్ హూందాగా వ్యవహరించాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కరీంనగర్ నుంచి ఎంపీగా రెండోసారి గెలిచిన బండి సంజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
తన కోసం ఐదు నెలలుగా కరీంనగర్ ప్లారమెంట్ నియోజకవర్గంలో పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండటంతోనే ప్రజలు జాతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకొని ఓట్లు వేశారని పేర్కొన్నారు. రామాలయం కట్టిన అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయిందని గుర్తుచేశారు. సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.