హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డి 11 నెలల పాలనలో ఏం వెలగబెట్టినట్టు? ఏం ఒరగబెట్టినట్టు? ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుతున్నారు’ అని బీఆర్ఎస్ నేత, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి నిలదీశారు. గురుకులాలు నిర్వీర్యం కావడానికి, విద్యార్థులు చనిపోవడానికి, గురుకుల అద్దె భవనాలకు తాళాలు పడటానికి కారకులు ఎవరు? అని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం పార్టీ నేతలు కే నరేందర్, మహేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో 11 నెలల పాలనాకాలంలో ఏమి సాధించి పెట్టారో? ఏ హామీలు అమలుచేశారో? ప్రజలకు వివరించి విజయోత్సవాలు జరుపుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటైనా పూర్తి చేశారా? అని నిలదీశారు. ఏడాది పాలన పూర్తిచేసుకోబోతున్న రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి 36 మార్కులు సాధించలేక ఫెయిల్ అయ్యారని విమర్శించారు.
ఆర్ఆర్ (రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి) ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్ కుట్రగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాభవన్ ప్రజల ఆందోళనలకు అడ్డాగా మారిందని, ఇకనైనా ప్రజాపాలనపై దృష్టిపెట్టాలని వాసుదేవరెడ్డి హితవుపలికారు.