హైదరాబాద్, అక్టోబరు 14 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నేత శుభప్రద్‌పటేల్ తెలిపారు. ఓ వైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు 1.5లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూనే… మరోవైపు మూసీని ముంచే రాడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపడం ఏమిటని ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వికారాబాద్ కా హవా.. లాకో మరీజోంకా దవా అని నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాడార్ కేంద్రం ఏర్పాటుతో మనుషులు, జీవరాశులకూ పెనుముప్పు కలుగుతుందని తెలిపారు. రాడార్ కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. దామగుండంలో రాడార్ స్టేషన్‌ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని, మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామని శుభప్రద్ పటేల్ తెలిపారు.
కరోనా కాలపు వాహనాలకు ఇక్కట్లు
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో కొనుగోలు చేసిన వాహనాలలో కొన్నింటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకపోవడంతో వాటి రీరిజిస్ట్రేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో 2019 నుంచి వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీని తప్పనిసరి చేశారు. 2021-23 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీని పొందటం ఇబ్బందిగా మారింది. దీం తో వాహన యజమానులు తమకు నచ్చిన నంబర్ప్లేట్లను వాహనాలకు బిగించుకున్నారు. ఆ వాహనాల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో రికార్డు కాకపోవడంతో ఇప్పుడు ఆ వాహనాల కొనుగోలు, అమ్మకాలకు తీవ్ర ఇబ్బందులేర్పడుతున్నాయి. దీనిపై పాలనాపరమైన నిర్ణయం తీసుకొని.. దశలవారీగా 20 వేల నుంచి 30 వేల చొప్పున వాహనాలకు విముక్తి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఓ సీనియర్ రవాణాశాఖ అధికారి తెలిపారు.