RS Praveen Kumar | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాజాగా నిర్వహించిన గ్రూప్-2 పేపర్లో ప్రశ్నలు అన్నీ తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తదితర తెలంగాణ ద్రోహుల మీదనే ఇచ్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన కేసీఆర్ మీద కానీ, ఉద్యమాన్ని అగ్రగామి శక్తిగా నడిపి తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ మీద కానీ ప్రశ్నలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని విమర్శించారు. రేవంత్ రచించిన కేసీఆర్ ఆనవాళ్ల నిర్మూలన పథకంలో ఇది మరో అడుగు అన్నమాట అని వ్యాఖ్యానించారు.
గ్రూప్ 2 ప్రశ్నపత్రాలను గాంధీ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆత్రేయపురం పూతరేకులు తింటూ తయారు చేసినట్లుగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. నాన్ లోకల్ కోటాలో కేవలం ఆంధ్ర అభ్యర్థులకు మాత్రమే లాభం జరగాలనే ఉద్దేశంతో ఈ పేపర్ తయారు చేశారని ఆరోపించారు. మీరెన్ని చేసినా కేసీఆర్ సంతకాన్ని చెరిపివేయలేరని తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తి
కుమ్రంభీం స్ఫూర్తితో లగచర్ల రైతుల పోరాటం కొనసాగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. లగచర్ల పోరాటానికి దేశ రాజకీయాలను మార్చే శక్తి ఉందని పేర్కొన్నారు. విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన జాతి మనది అని అన్నారు. దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాడిన థానునాయక్ ఇవాళ లగచర్ల జ్యోతిలో కనిపిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశానికి రాకుండా హైదరాబాద్ సరిహద్దుల్లో ఎంతోమందిని అడ్డుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కోసం కేటీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. యూరప్ నగరాలకు ధీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కేటీఆర్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.