బండ్లగూడ, సెప్టెంబర్ 13: సీఎం రేవంత్‌రెడ్డి తన పాలనలో అడుగడుగునా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ పాలనే సాగడం లేదని, కనీసం రాజ్యంగం ఎప్పుడైనా ఆయన చదివారా? అని ప్రశ్నించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గూండాయిజం చేయాలని సీఎం స్క్రిప్ట్ ఇచ్చి మరీ చేయిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం రక్షించబడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతబట్టుకుని ప్రతిచోట ప్రచారాన్ని కొనసాగిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, ఇదేమి రాజ్యం, ఇదేమి న్యాయం అని మండిపడ్డారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, నేతల గృహా నిర్బంధం, అక్రమ అరెస్టులే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి పోలీసులు తనను గృహనిర్బంధం చేశారని, తనును కలవడానికి వచ్చిన నేతలను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. శాసనసభ్యుడైన పాడి కౌశిక్‌రెడ్డిని చంపడానికి గూండాలతో వచ్చిన అరికెపూడి గాంధీకి పోలీసులు రెడ్ కార్పెట్ వేసి పోలీస్‌స్టేషన్‌లో కుర్చోబెట్టారని, బాధితుడైన కౌశిక్‌రెడ్డిని నిర్బంధించారని విమర్శించారు. ఎసమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియ, పుడరి సైదులు, బీఆర్ఎస్ బండ్లగూడ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు, అరుణ, క్వీన్ ఎలిజబెత్, జంపన్న, భీమయ్య, నటరాజ్, అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.