RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మాదాపూర్లో ఒక చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి మూడు రోజులైతున్నది అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు.
మొన్న రక్తపు గాయాలతో బాధితులు రాత్రి 3.30 గంటలకు కాల్ చేసినా స్పందన లేదు. ఎఫ్ఐఆర్ 18 గంటల తరువాత చేశారు. బాధితులే పాపం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి నయం చేయించుకున్నారు. ఇంతవరకు ఒక్క నిందితున్ని కూడా అరెస్టు చేయలేదు. ఈ మాఫియా గ్యాంగ్ మీద ఇంతకు ముందే ఒక కేసు ఉంది. ఆ కేసులో కూడా వాళ్లు ఎవరూ అరెస్టు కాలేదు. ఎందు కంటే వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు(రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి లాగ అన్న మాట). అంత వరకు మన పోలీసులు అరెస్టు చేయరు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
సరిగ్గా ఇప్పుడు కూడా మళ్లీ అదే జరగబోతుంది. వాళ్లు మారణాయుధాలతో దాడి చేసి, సీసీటీవీలు ధ్వంసం చేసి ఆధారాలు లేకుండా చేసి, ఇక్కడ ఉంటే చంపేస్తామని బెదిరించినా వాళ్లను ‘దేశంలో నంబర్ వన్ పోలీసు’ అయిన మన తెలంగాణ పోలీసులు ముట్టుకోరు. వాళ్లు పక్కా గా స్టే తెచ్చుకుంటారు. ఇప్పటికీ నేరస్తులు బాధితులను ఫోన్లలో బెదిరిస్తూనే ఉన్నారు. వాళ్ల మీద పీడీ యాక్ట్ పెట్టాలన్న ఆలోచన కూడా మన పోలీసులకు రాదు. ఇక ప్రధాన మీడియాకు ఇది కనిపించే అవకాశమే లేదు. అది ఎప్పుడూ దళితులకు ఆమడ దూరంలో ఉంటది అని ఆర్ఎస్పీ అన్నారు.
అసలు విషయం ఏంటంటే.. ఇక్కడ నిందితులు శ్రీనివాస్ రెడ్డి, కవితా రెడ్డి, ఇతర గూండాలు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. బాధితులేమో వెంకయ్యలు, ఎల్లయ్యలు, పుల్లయ్యలు అని తెలిపారు. జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశాలు అంటే పోలీసులకు నవ్వులాటగా ఉంది. హైకోర్టు ఆదేశాలు కూడా ఇక్కడ భేఖాతర్!! చేష్టలుడిగిన పోలీసు అధికారుల పై ఇంతవరకు చర్యలు లేవు అని ఆర్ఎస్పీ మండిపడ్డారు. బుద్దపూర్ణిమ నాడే నిర్మల్లో దళితుల మీద దాడి జరిగింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడా దళితులకు రక్షణ లేదు. ఇక్కడ భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నా.. రాజనర్సింహ మినిస్టర్ గా ఉన్నా దళితులకు ఒరిగింది శూన్యం. బిగ్ జీరో. మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డిని నిలదీసి దళితులను కాపాడండి, లేదా వెంటనే రాజీనామా చేసి రాజకీయాల్లో నుండి తప్పుకోండి అని ఆర్ఎస్పీ హెచ్చరించారు.