RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు రాక పడుతున్న ఇబ్బందులపై ఆర్ఎస్పీ ఎక్స్ వేదికగా స్పందించారు.
సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్ల మీదికొచ్చి కొట్లాడుకుంటున్నరు బాగానే ఉంది కానీ.. తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులకు గత నాలుగు నెలల నుండి జీతాలు రాక హాహాకారాలు చేస్తున్నారు తెలుసా? వాళ్ల కుటుంబాలు ఆకలి చావుల అంచుల్లో ఉన్నాయి!! ఆకలితో ఉన్న ఉద్యోగులు పేద ఎస్సీ పిల్లలకు చదువెట్లా చెప్తరు..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
ముందు వెళ్లి డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గర కూర్చుని వారి జీతాలు పడేటట్టు చూడండి. మీ మంత్రులకు జీతాలు వచ్చినపుడు ఈ చిరుద్యోగులకు కూడా రావాలె కదా? మీ మంత్రులకు తన్నుకునే సమయం ఉన్నది కానీ ఉద్యోగుల తండ్లాట పట్టించుకునే బాధ్యత లేదా రేవంత్ రెడ్డి గారు అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.