హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బండి సంజయ్ కేంద్ర మంత్రా? లేక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధా? అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి నిలదీశారు. రేవంత్‌ను తిడితే కాంగ్రెసోళ్లే సరిగా పట్టించుకోవటం లేదని, కానీ బండి సంజయ్ న్యూఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. రేవంత్‌కు అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అర్హత అయినా తెలుసా? అని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి జైల్లో వేస్తారన్న బండి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ను జైల్లో పెట్టకపోతే తాను యుద్ధం చేస్తానన్న బండి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ఒక కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఇసుమంత అవగాహన లేకుండా, తెలివితక్కువతనంతో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారని నిలదీశారు. ఎంపీగా మసీదులు తవ్వాలె.. శవాలు తవ్వాలె.. లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పోనీలే అని అనుకున్నామని, కేంద్ర మంత్రి హోదాలోనైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానంతో మాట్లాడాలని చురక అంటించారు. లేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం వస్తుందని ఎద్దేవా చేశారు.
‘జైల్లో వేయటం మంత్రులు, ముఖ్యమంత్రుల పనా? కేటీఆర్‌పై ఏమైనా పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుల కేసులు ఉన్నాయా? ఎమ్మెల్సీలకు డబ్బులు ఇస్తే దొరికిపోయిన కేసులు ఉన్నాయా?’ అని బండి సంజయ్‌పై శ్రీధర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ, జైశ్రీరాం నినాదాల వల్ల బండికి ఆ పదవి వచ్చిందని, అలాగని కేటీఆర్‌ను విమర్శిస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. పదేండ్లు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని.. రాష్ర్టానికి 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 25 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించిన కేటీఆర్‌ను అరెస్టు చేయాలని మాట్లాడటం ఎంత చిల్లర విషయమో తెలుసుకోవాలని మండిపడ్డారు.
ఎంపీగా కరీంనగర్‌కు కనీసం ఒక్క కల్వర్టుకైనా నిధులు తీసుకొచ్చారా? అని బండిని నిలదీశారు. తమరు రాష్ర్టానికి ఏం చేశారో కనీసం ఐదు నిమిషాలైనా చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నయాపైసా తీసుకురాని దద్దమ్మలు రాష్ట్ర కేంద్రమంత్రులు అని ధ్వజమెత్తారు. ఇద్దరు తెలివితక్కువ, అసమర్థులు, చదువురానివాళ్లు కేంద్ర మంత్రులుగా రాష్ర్టానికి భారంగా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అన్న బండి వ్యాఖ్యలకు శ్రీధర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా బండి సంజయ్ ఎవరి చేతిలో ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ‘బండి సంజయ్‌కు దమ్ముంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పది శాతం సర్పంచులు, పంచాయతీ ఎన్నికలల్లో పది శాతం ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ సీటు గెలిపించాలి. కిషన్‌రెడ్డిని కూడా అడుగుతున్నా. దమ్ముంటే తన సొంత గ్రామంలో బీజేపీ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించాలి’ అని సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి మెప్పు పొందటం కోసం బీజేపీ నాయకులు ఎందుకు పాకులాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో నితీశ్ నారా డిఫెన్స్ అలయన్స్ అయిందని, తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ కూడా రేవంత్‌రెడ్డి, బీజేపీ అలయన్స్ అయ్యిందని ఆరోపించారు. బలమైన నిర్మాణం ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.