Rakesh Reddy | హైదరాబాద్ : మానుకోట రాళ్ళ ఘటన తెలంగాణ తెగింపుకు ఒక నిదర్శనం.. ఈ గడ్డపై నుండి మొదలైన ఏ ఉద్యమం ఓడిపోలేదు అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగుల రాకేశ్ రెడ్డి గుర్తు చేశారు. మానుకోట పట్టణంలో మానుకోట నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాకేశ్ రెడ్డితో పాటు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మానుకోట ఒక ఉద్యమాల గడ్డ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి యువత, సామాన్య ప్రజలు చూపిన తెగువ ఎంతో స్ఫూర్తిని రగిల్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గ్రామీణ ప్రాంతంలో మొదలైన ఈ ఉద్యమం యావత్ తెలంగాణ యువతను కదిలించడం ఖాయం అని రాకేశ్ రెడ్డి అన్నారు.
నిరుద్యోగ యువత డిమాండ్స్ ఇవే..
1. యూత్ డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలి.
2. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.
3. కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.
4. డీఎస్సీ పోస్టులు వేయాలని, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలి.
5. గురుకుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి.
6. గ్రూప్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి.
7. జీవో 46 రద్దు చేయాలి.
8. గ్రూప్ -1 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.