Rakesh Reddy | హైదరాబాద్ : ఆయనో గొప్ప క్రీడాకారుడు.. కానీ క్రీడా మంత్రిగా అనర్హుడు అని మంత్రి అజారుద్దీన్‌కు కేటాయించిన శాఖను ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆయన మైనార్టీ, ఆ మైనార్టీ ఓట్ల కోసమే ఆయనను మంత్రివర్గం లోకి తీసుకున్నారు కాబట్టి అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ కేవలం రాజకీయాలే చేస్తుంది తప్ప అభివృద్ధి కాదనీ ఈ చర్యతో అర్ధం చేసుకోవాలి. జూబ్లిహిల్స్ ‘ చెయ్యి’ జారిపోతుంది. కాబట్టి, అర్జంట్‌గా అజారుద్దీన్ గుర్తొచ్చాడు, ఆయన మంత్రి అయ్యాడు. ఎన్నికల కోడ్ ఉండగా ఆయనకు మంత్రి పదవి ఎలా ఇస్తారని అందరూ ప్రశ్నిస్తుంటే, అజారుద్దీన్ ఒక గొప్ప క్రీడా కారుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తుంటే అడ్డు పడుతున్నారు అని కాంగ్రెస్ నాయకులు చాలా బాధపడ్డట్టు మొసలి కన్నీరు కార్చారు. కానీ, పాపం ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టడం కోసమే అని ఇప్పుడు స్పష్టమైంది అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఒకవేళ కాంగ్రెస్ నిజంగా అభివృద్ధి కోసమో, అజారుద్దీన్ అనుభవం, సేవలు ప్రభుత్వానికి అవసరం అనుకుంటే ఆయన మైనారిటీ సంక్షేమం కంటే రాష్ట్రంలో క్రీడల ఉన్నతికి, యువజన సర్వీస్‌లకు సరైన వ్యక్తి అనేది ఎల్కేజీ పిల్లగాడిని అడిగినా చెప్తారు. మీరు ఎంత పెద్ద క్రికెటర్‌ను తెచ్చినా హైదరాబాద్ నగరం జూబ్లిహిల్స్ స్టేడియం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పిచ్. మీరు అజారుద్దీన్‌ను తెచ్చినా, హర్బజన్ సింగ్‌ను తెచ్చినా డక్కవుట్ అవ్వడం ఖాయం. డిపాజిట్లు గల్లంతవడం కూడా ఖాయం అని ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు.