హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే, రేవంత్‌రెడ్డి పాలనలో పెట్టుబడులు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. భారీగా పెట్టుబడులు వస్తున్నట్టు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు చెప్పారు. ఏబుల్లీడర్, స్టేబుల్ గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ విధానాల ద్వారా నాడు కేసీఆర్ పాలన సాగిస్తే, నేడు అన్ఎఫిషియంట్ లీడర్, కరెప్టెడ్ గవర్నర్మెంట్, రిగ్రెస్సివ్ పాలసీల ద్వారా రాష్ర్టాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్తున్నారని మండిపడ్డారు.
ప్రీమియర్ ఎనర్జీస్, అమరరాజా లాంటి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. గతంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.300 కోట్లు వసూలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గచ్చిబౌలి లాంటి ఖరీదైన ప్రాంతాల్లో 400 ఎకరాలు అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు.