హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): కొడుకి మంత్రి పదవి ఇప్పించడానికి, తనకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అనేక తంటాలు పడుతున్నారని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ను తిడితే తన కొడుకి మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ కుటుంబాన్ని మైనంపల్లి టార్గెట్ చేశారని అన్నారు. మైనంపల్లి మొన్న గజ్వేల్‌కు వచ్చి హైడ్రా, మూసీ గురించి ఎందుకు మాట్లాడారని, గజ్వేల్ ప్రజలకు హైడ్రాతో సంబంధం ఏమిటని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసలు ఆయనకు అవగాహనే లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిదని మైనంపల్లికి హితవుపలికారు.
తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో 12 జిల్లాలకు మేలు కలుగుతున్నదని, మూసీ సుందరీకరణతో ఎంతమందికి మేలు జరుగుతున్నదో మైనంపల్లి చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీని రూ.1.50 లక్షల కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తే ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? అని ప్రశ్నించారు.
లక్ష 50 వేల కోట్లు అంటే ఎన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకున్నామని, ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించి ఇచ్చామని చెప్పారు. మరి మూసీ బాధితులకు ఎలాంటి సహాయం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.