రేవంత్‌రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటివేళ్లతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ప్రజలకిచ్చిన హామీల అమలు చేతగాక దూషణలకు రేవంత్‌రెడ్డి దిగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని తిట్టిపోయడమే సంబురమా? అని నిలదీశారు. ఆర్థిక పరిస్థితి మీద రేవంత్‌కు అసలు అవగాహన ఉన్నదా? కేసీఆర్ హయాంలో అప్పులు పెరిగాయ్ అంటున్నవ్.. దేశంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కన్నా బాగుందని అనేక నివేదికలు చెప్పాయి.. దీనికి ఏమంటావు? అని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితిపై తనతో చర్చకు వస్తావా రేవంత్? అని సవాలు విసిరారు.
బీఆర్ఎస్ మొక్క కాదు మహా వృక్షమని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఆ మహావృక్షాన్ని అంతం చేయడం రేవంత్ వల్ల అవుతుందా అని ఎద్దేవా చేశారు. రేవంత్ లాంటి వాళ్లు ఎంతో మంది వస్తారు పోతారు.. బీఆర్ఎస్ అలానే ఉంటుందని స్పష్టంచేశారు. మూసీకి లక్షన్నర కోట్లు కావాలి అంటున్నవ్.. ఎకడ్నుంచి డబ్బులు తెస్తావ్ రేవంత్? అని నిలదీశారు. వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం కేసీఆర్ హయాంలోనే జరిగిందని, కేవలం రంగులు వేసి క్రెడిట్ తీసుకోవడానికి రేవంత్‌కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు.
కేసీఆర్ మొక్క కాదు అని.. రేవంతే పిల్ల మొక్క అని.. దాన్ని వేళ్లతో సహా పీకేసే రోజు త్వరలోనే వస్తుందని పొన్నా లక్ష్మయ్య తెలిపారు. రేవంత్ కుటుంబసభ్యుల కోసం కొడంగల్‌లో ఫార్మా తెచ్చి పేద రైతులను వేధిస్తారా? అని నిలదీశారు. ఎపుడైనా భూ సేకరణ కోసం రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారా అని ప్రశ్నించారు. రేవంత్ పాలన ఆశ్రిత పక్షపాతంతో కూడిన పాలన అని మండిపడ్డారు. తాము కూడా గతంలో భూ సేకరణ చేశామని, ఇందుకు రైతులతో గంటలు గంటలు మాట్లాడి ఒప్పించామని గుర్తుచేశారు. అసలు రేవంత్‌కున్న పాలనా అనుభవం ఎంత? కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఖబడ్దార్ రేవంత్.. ఇకనైనా పద్ధతి మార్చుకో అని హెచ్చరించారు.