నల్లబెల్లి, సెప్టెంబర్ 19: జిల్లా దవాఖాన, మెడికల్ కళాశాలను మంజూరు చేసిన తమపైనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధం విధించడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని తన నివాసం లో ఆయన గురువారం మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నర్సంపేటలో రూ.283కోట్లతో జిల్లా దవాఖానను మంజూరు చేశారన్నారు. తన కోరిక మేరకు కేసీఆర్ ఆనాడే మెడికల్ కాలేజీని మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. కళాశాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన తననే హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
హనుమకొండ: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణుల హౌస్ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ మంజూరు చేసింది మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమైతే.. కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు కుటిల యత్నానికి పాల్పడుతున్నదని ఆరోపించారు.