Patnam Narender Reddy | సీఎం రేవంత్ రెడ్డి పాలనంతా డైవర్షన్ పాలిటిక్స్ అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. లగచర్ల దాడి ఘటనలో తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. 37 రోజులు జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందారని అన్నారు.
లగచర్ల ఘటనలో కేటీఆర్‌ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారని పట్నం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన రైతులకు బేడీలు వేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని రేవంత్ రెడ్డికి సూచించారు.
రైతుబంధుపై పెద్ద పెద్ద మాటలు చెప్పి మాట తప్పారని రేవంత్ రెడ్డిని పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. అల్లు అర్జున్ అంశంపై గంటసేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు. కానీ రైతుల సమస్యలపై మాట్లాడమంటే సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.