హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అంతర్గత ఒప్పందంతో పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీల లక్ష్యం కేసీఆర్‌ను దెబ్బతియడమేనని స్పష్టంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో చాలా విచిత్రాలు జరుగుతాయన్నాని, బీజేపీ, కాంగ్రెస్ అక్రమ పొత్తు కొనసాగుతున్నదని విమర్శించారు.
రెండు పార్టీలు కలిసి తెలంగాణ సంపదను అమ్మేస్తున్నాయని, సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తున్నాయని, ఈ వేలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్లారని చెప్పారు. కాంగ్రెస్ వేసిన విద్యుత్తు కమిషన్‌కు బీజేపీ మద్దతు పలుకుతూ కేసీఆర్‌ను టార్గెట్ చేశాయని తెలిపారు. కాంగ్రెస్ బీ ఫామ్‌పై గెలిచిన తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం టీడీపీ ఆఫీస్‌లో గెలుపు సంబురాలు చేసుకున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ లోక్‌సభలో అద్భుతంగా మాట్లాడారని టీడీపీ సోషల్ మీడియా స్పందిస్తున్నదని ఆధారాలను చూపించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయాలని రాహులుగాంధీ చెప్పినట్టు తెలుస్తున్నదని అనుమానం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు కవచం అని, తెలంగాణ ప్రయోజనాల కోసమే పాటుపడుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ వ్యవరిస్తుంటే కాంగ్రెస్ వత్తాసు పలుకుతున్నదన్నారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఖాయమని చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రధాని ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించినా కేసీఆర్ వెళ్లలేదని గుర్తుచేశారు. తాను, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారే ప్రసక్తే లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతామని మరోసారి స్పష్టం చేశారు.