Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపటి క్రితం నుంచి కంది సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు క్రిశాంక్‌పై రాష్ట్రవ్యాప్తంగా 20 కేసులు నమోదయ్యాయి. 2024లో మొదలైన ఈ కేసుల దాడి 2025 సంవత్సరంలో పరాకాష్టకు చేరగా, 2026 నాటికి అది మరింత ఉధృతమైంది. ఒకే సంవత్సరంలో పదికి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం విస్మయానికి గురిచేస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వేధింపులకు పాల్పడుతున్నదో వర్ధమాన దళిత నేత క్రిశాంక్‌పై పెట్టిన కేసుల సెక్షన్లు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ కేసుల పరంపరలో తాజా ఉదంతం మరింత దారుణంగా ఉన్నది. తన భార్యపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలని, బాధ్యుడైన రాజేంద్రకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఇటీవల క్రిశాంక్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. మహిళపై నిరాధార ఆరోపణలు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలిపినందుకు క్రిశాంక్పైనే ఉల్టా కేసు బనాయించారు.
అదే రాజేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు క్రిశాంక్‌తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 24న క్రిశాంక్‌ను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయనను సంగారెడ్డి జైలుకు తరలించారు. అయితే మే 6వ తేదీన సంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ క్రిశాంక్ మీద వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే పీటీ వారెంట్‌లో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోర్టుకు ఆయనను పోలీసులు తీసుకువచ్చారు. సీనియర్ సివిల్ కోర్టు జడ్జి విచారించి బెయిల్ మంజూరు చేశారు. నిర్మల్ నుంచి ఆయనను సంగారెడ్డి జైలుకు పోలీసులు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.