హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణలో రూ.839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వాల్స్ కర్రా హోల్డింగ్స్ కంపెనీ ముందుకొస్తే ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం కార్యాలయం ప్రకటించడంపై మండిపడ్డారు. ఆ సంస్థ నాలుగు నెలల క్రితమే ఏర్పాటైందని, ఇద్దరే డైరెక్టర్లు ఉన్నారని, ఎలాంటి వార్షిక నివేదికలు లేవని వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మాజీ మంత్రి కేటీఆర్ కంటే తాను మెరుగ్గా పనిచేశానని చెప్పడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి బోగస్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం ఎవరితో, ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నా వారి ట్రాక్ రికార్డ్ మంచిదై ఉండాలని హితవుపలికారు.
తెలంగాణభవన్‌లో మంగళవారం క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. ్రైస్టెక్ ఆఫ్ అయిన వాల్స్ కర్రా హోల్డింగ్ కంపెనీ తెలంగాణలో ఎట్లా పెట్టుబడులు పెడుతుంది? అని నిలదీశారు. రాని కంపెనీల కోసం రేవంత్‌రెడ్డి అమెరికాకు వెళ్లారా? అని ప్రశ్నించారు. దావోస్ వెళ్లి గోదీ ఇండియా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని, రూ.27 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ఈ సంస్థ ఎలా పెట్టుబడిపెడుతుందని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు అప్పగించే సంస్థపై లుక్ అవుట్ నోటీసు ఉన్నదని చెప్పారు. సీఎం బృందం అమెరికా పర్యటనలో, సీఎం తమ్ముడి బృందం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారని తెలిపారు. ప్రజల ధనంతో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తెలంగాణకు పెట్టుబడుల కోసం ఒరిజినల్, మంచి ట్రాక్‌రికార్డ్ ఉన్న కంపెనీలను తీసుకురావాలని హితవుపలికారు.
ముఖ్యమంత్రి పర్యటనలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా నాటకాలు బంద్ చేసి సరైన కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకురావాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ ఖ్యాతి గడించిందని క్రిశాంక్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ ఎగుమతులు పెరిగాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం వృద్ధి చెందాయని చెప్పారు. హైదరాబాద్ ఐటీకి గమ్యస్థానంగా మారినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ.2,500 ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.