హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీకి రేవంత్‌రెడ్డి సర్కారు రూ.6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇవ్వడంపై కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దివాలా తీసి, సిబ్బంది వేతనాల కోసం ఇండియన్ బ్యాంకులో రూ.15 లక్షల రుణం తీసుకుంటున్న ఈ కంపెనీకి రెండేండ్లలో వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా కట్టబెట్టుతున్నారని ప్రశ్నించారు. ఆ సంస్థపై రేవంత్‌రెడ్డి ఎందుకు అంత ప్రేమ? ఆ సంస్థ స్నేహితులదా? బినామీ కంపెనీనా? లేకపోతే కమీషన్ల కోసమా? ఎందుకు కాంట్రాక్టులు ఇస్తున్నారని నిలదీశారు.
బిల్లులు ఎగ్గొడుతున్న ఆ సంస్థపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కొందరు చిన్న కాంట్రాక్టర్లు సీబీఐను ఆశ్రయించగా, వారు పట్టించుకోకపోవడంతో హైకోర్టు గడపతొక్కారని చెప్పారు. ఆ సంస్థ వ్యవహారాలపై విచారణ చేయకపోవడంపై రాతపూర్వక వివరణ ఇవ్వాలని న్యాయస్థానం సీబీఐకి ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. దివాలా తీసింది కాబట్టి ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలు తక్షణమే నిలిపివేయాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఈ రోజు (బుధవారం) విచారణలో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఒకవైపు హైకోర్టు సీబీఐ దర్యాప్తు ఆదేశించినా, మరోవైపు ఎన్సీఎల్ఏటీ ఆర్థిక లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ కంపెనీకి వేల కోట్ల విలువైన కొత్త కాంట్రాక్టులు ఆమోదించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రూ.5 లక్షల కోట్ల హిల్ట్‌పీ భూస్కామ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి హత్యాయత్నం, దౌర్జన్యకాండ గురించి విచారణ చేపట్టాల్సిన సర్కారు.. ఇవన్నీ ఎలా లీకయ్యాయని ఆరా తీస్తున్నదని క్రిశాంక్ ఎద్దేవా చేశారు. ఇలాంటి స్కామ్‌లను డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి, మంత్రులు, అనవసరమైన అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గ్రామ దేవతలను కూడా రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఎంతసేపూ కాంట్రాక్టులు, కమీషన్ల మీదే ఆయనకు యావ ఉంటుందని ధ్వజమెత్తారు. పరిశ్రమల భూముల మార్పిడి కోసం కొత్తగా తీసుకొచ్చిన హిల్ట్ విధానంపై దమ్ముంటే సీబీఐ విచారణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీతో సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆడటం తన సొంత వ్యవహారమనీ, అదే ప్రధానం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిష్టి వ్యాఖ్యలు చేసి పది రోజులవుతున్నదని, బీఆర్ఎస్ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆ మరుసటి రోజే స్పందించారని క్రిశాంక్ గుర్తుచేశారు. కానీ, ఇ ప్పుడు ఆ అంశంపై మాట్లాడటానికి మంత్రు లు క్యూ కడుతున్నారని, ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదైనా, దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి.. ఇస్తవా? చస్తవా? అని నిలదీస్తానంటూ ప్రగల్భాలు పలికి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి… బుధవారం భేటీలో చేతులు కట్టుకుని కూర్చున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీ కాబట్టే కేఎల్ఎస్ఆర్ సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6,000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందా? అని క్రిశాంక్ అనుమానం వ్యక్తంచేశారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీపై ఇప్పటికే 3-4 సార్లు తాను మాట్లాడినా కాంగ్రెస్ నేతలు ఎవరూ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని గుర్తుచేశారు. కేవలం ఆ కంపెనీ ప్రతినిధులు మాత్రమే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ కంపెనీకి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు, ఎన్సీఎల్ఏటీ తుదితీర్పు వచ్చే వరకు కొత్త కాంట్రాక్టులు ఇవ్వకూడదని స్పష్టంచేశారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎందుకు మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ, ఐటీలను ఎందుకు రంగంలోకి దించడంలేదని నిలదీశారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీని బీజేపీ సర్కారు ఎందుకు రక్షిస్తున్నదని ప్రశ్నించారు.
