హనుమకొండ, నవంబర్ 13 : కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ బీసీలకు ద్రోహం చేసేదని, బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. గురువారం ఆయన హనుకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఊరుకునేది లేదని, ఇదే జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. బీసీలకు జరిగే అన్యాయం చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్ విషయంలో ఒక్కోసారి ఒక్కోమాట చెప్తూ బీసీల్లో గందరగోళం సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. గత రెండు, మూడు రోజులుగా బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతూ పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా పనిచేయడం సరికాదని అన్నారు. ఇదే విషయమై వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఎవరి మెప్పు కోసమో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు.
వరద బాధితులకు సాయం చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారిని కించపరిచేలా మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఫంక్షన్లలో మిగిలిన భోజనాన్ని వరద బాధితులకు అందజేయాలనడం వారిని కించపరిచినట్టేనని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం గడువు ముగిసిన తరువాత కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ నియోజక వర్గ పరిధిలో ఉండటం చట్టాన్ని అతిక్రమించడమేనని అన్నారు. దాన్ని ఎత్తిచూపితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. కేసులు తమకు కొత్త కాదని, రౌడీయిజం, గూండాయిజానికి భయపడేది లేదని స్పష్టంచేశారు. సమావేశానికి ముందు కాళోజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.