హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వానికి నివేదికను అందించాలని బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కోరారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర రావు మంగళవారం నిర్వహించిన బహిరంగ విచారణలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొని అభిప్రాయాలను వ్యక్తంచేశారు. చైర్మన్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అనంతరం సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 6 నెలల్లో కులగణన, బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ప్రస్తుతం ఆ విషయాన్నే మరిచిపోయిందని విమర్శించారు.
రాజకీయ పార్టీలు, అన్ని సంఘాల ఒత్తిడితోపాటు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కమిషన్‌ను కాదని డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో 75 ప్రశ్నలు ఉండటం, వ్యక్తిగత గోప్యత భంగం కలిగించే సమాచారాన్ని సేకరించడం, సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో మళ్లీ చికుల్లో పడే ప్రమాదముంటుందని కమిషన్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాస్త్రీయం గా, లోతుగా అధ్యయనం చేసి నివేదిక రూ పొందించాలని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ నేతలు స్వామిగౌడ్, పల్లె రవికుమార్‌గౌడ్, ఆంజనేయగౌ డ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు. డెడికేటెడ్ కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు దాదాపు 40సంఘాల నుంచి ప్రతినిధులు వచ్చి తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు వెల్లడించారు.