ఖమ్మం సిటీ, మే 28: ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన ‘రాకేశ్‌రెడ్డి ఈ-క్లాస్రూమ్’ యాప్‌ను మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామ ని చెప్పిన కాంగ్రెస్.. రెండున్నరేండ్లు దాటినా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
కనీసం నోటిఫికేషన్లు కూడా ప్రకటించడం లేదని ధ్వజమెత్తారు. పైగా, గత కేసీఆర్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలనే నిస్సిగ్గుగా తమవంటూ చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు. యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మభ్యపెట్టారని మండిపడ్డారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అడ్డిమార్ గుడ్డి దెబ్బలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. నమ్మించి నట్టేట ముంచడమే కాంగ్రెస్ స్వభావమని విమర్శించారు. రాకేశ్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడని, నిరుద్యోగ యువత బాధలు తెలిసినవాడని తెలిపారు. ‘ఈ-క్లాస్రూమ్ యాప్’ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాము రూపొందించిన ‘రాకేశ్‌రెడ్డి ఈ-క్లాస్రూమ్’ యాప్ ఉచితమని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారి కోసం తనవంతు సహకారం ఉండాలన్న ఆకాంక్షతోనే ఈ యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులందరూ ఉచితంగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే లు తాటి వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్య, బీఆర్ఎస్ నేతలు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, బత్తు ల మురళి, నాగండ్ల కోటేశ్వరరావు, అజ్మీరా వీరూనాయక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.