హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ‘ఎన్నికలు ముగిసినయ్.. ఇకనైనా అబద్ధాల ప్రచారం ఆపి పాలనపై దృష్టి పెట్టండి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సూచించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై క్రిశాంక్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ, తెలంగాణవాదం అవసరం లేదని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేశాయని గుర్తుచేశారు. తమిళనాడు నుంచి ఏపీ, పశ్చిమబెంగాల్ నుంచి యూపీ వరకు దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎంత అవసరమో ఈ ఫలితాలు నిరూపించాయని చెప్పారు.
అబద్ధాలకు తలవంచేది లేదని, మోదీ, రాహుల్‌గాంధీ గ్యారెంటీలు ప్రజలకు చేరేదాకా పోరాడుతామని స్పష్టంచేశారు. హామీలను నిలబెట్టుకునే సమయం కాంగ్రెస్‌కు వచ్చిందని, వాటిని అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో బీఆర్ఎస్కు 2.61 లక్షల ఓట్లు వస్తే బీజేపీకి 1.08 లక్షల ఓట్లు వచ్చాయని, వరంగల్‌లో బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ 2.20 లక్షలని, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు 2.32 లక్షలని తాము బీజేపీతో చేయి కలిపి ఉంటే కాంగ్రెస్ ఎలా గెలిచేదని క్రిశాంక్ ప్రశ్నించారు. భువనగిరిలో బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ 2.20 లక్షలని, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు 2.54 లక్షలని, ఇక్కడ బీజేపీ అవకాశాన్ని బీఆర్ఎస్ దెబ్బకొట్టిందని, నాగర్‌కర్నూల్‌లో కేవలం 94 వేల ఓట్లతోనే బీజేపీపై కాంగ్రెస్ గెలిచిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్కు 3.19 లక్షల ఓట్లు వచ్చాయని, బీజేపీ కంటే కేవలం 40వేల ఓట్లు తక్కువని చెప్పారు. ఇక్కడ గట్టి పోటీ ఇవ్వకుంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయేవారని చెప్పారు.