హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): మంత్రి సీతక్క శాఖలో రూ. 30కోట్ల సెల్ఫోన్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసిన సెల్ఫోన్లలో అక్రమాలు జరిగాయని, యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. 4జీ ఫోన్లు పంపిణీ చేసి 5జీ ఫోన్లు అందజేసినట్టు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అవకతవకలను గుర్తించి టెండర్‌ను ఆమోదించేందుకు నిరాకరించారనే నెపం తో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఓ మహిళా సెక్షన్ ఆఫీసర్‌ను బదిలీ చేశారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను తప్పించి తిరిగి టెండర్లు పిలిచారని తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసమున్నదని, ఈ వ్యవహారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం ఒక్కో ఫోన్‌కు రూ.11,800 చొప్పున టెండర్ నిర్ణయించగా మంత్రి అనుయాయుల ద్వారా సగం ధరకే కొనుగోలు చేశారని తెలిపారు. శాంసంగ్ గ్యాలక్సీ ఏ06 మాడల్ ఫోన్ రిటైల్ షాపులో రూ.6,990 ధర పలుకుతున్నదని, బల్క్ ఆర్డర్ ద్వారా 38,310 ఫోన్లు కొనుగోలు చేస్తే గణనీయంగా ధర తగ్గుతుందని వివరించారు. ఏపీలో 5జీ ఫోన్లు పంపిణీ చేస్తే తెలంగాణలో మాత్రం 4జీ ఫోన్లు ఇవ్వడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అంగన్వాడీ సెల్‌ఫోన్ టెండర్లలో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు.