Koppula Eshwar | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ను చూసి తట్టుకోలేని మంత్రులు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. వాళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని అన్నారు. కేసీఆర్ సభపై రాష్ట్ర మంత్రులు చేసిన విమర్శలపై కొప్పుల ఈశ్వర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి తెలంగాణకు విలనే అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు, మంత్రులు మాట్లాడుతున్నారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. ఎన్ని ఉద్యమాలు, ఎన్ని త్యాగాలు, ఎంత మంది బలిదానాలు, ఎంత మంది శవాలపై నడిచి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని ప్రశ్నించారు. ఆ పరిస్థితిలో ఎవరైనా తలొగ్గి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆ పరిస్థితిని తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. దీనికి కాంగ్రెస్ మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను సోనియా గాంధీ జేబులో నుంచి తీసి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాకపోతే అసలు మీరెక్కడ, సీఎం ఎక్కడ అని ప్రశ్నించారు.
వరంగల్ సభకు ప్రజలు వెల్లువెత్తి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతే అని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. 25 సంవత్సరాల రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివడాన్ని చూసి మతి తప్పి కేసీఆర్పై మంత్రులు పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులు కట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. అవే అబద్ధాలపై రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ను చూస్తుంటే ఉత్త కుండకు ఊపులెక్కువ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలపై ముఖ్యమంత్రి ఓ మాట, మంత్రులు ఓ మాట, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న పార్టీ అని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కేసీఆర్కు పదవులు కొత్త కాదని.. తెలంగాణ సాధన కోసం తన పదవులను సైతం రాజీనామా చేసి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఏ మంత్రికి ఆ మంత్రి, ఏ ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యే టార్గెట్లు పెట్టుకొని దోచుకుంటున్నారని విమర్శించారు. మీరు మాకు నీతులు చెప్పే స్థాయిలో లేరని మండిపడ్డారు. మీ ప్రభుత్వంపై, మీపై ప్రజలకు కనీస గౌరవం లేదని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో తిరగలేని పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు నెలకొందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసిండ్రు అని, నీళ్లు ఇవ్వలేక ఎండబెడుతున్నారని మండిపడ్డారు. పొలాలు ఎండిపోతున్నాయని, పంటను కొనడం లేదని, ఇప్పటికే వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా ఉన్నదో చెప్పగలరా అని కాంగ్రెస్ నాయకులను కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క సర్పంచ్ అయినా రోడ్డు ఎక్కాడా అని ప్రశ్నించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాక రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. దీని గురించి మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సర్పంచ్లు, కాంట్రాక్టర్ల బిల్లులకు కమీషన్ అడిగేది నిజం కాదా అని నిలదీశారు. మీ చేతకాని పరిపాలనను తక్కువ కాలంలోనే ప్రజలు తెలుసుకొని చీదరించుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు.