సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొందని, కృష్ణ గోదావరి నీళ్లు దోపిడికి గురవుతూ హక్కులకు భంగం వాటిలోతోందని, సమైక్యాంధ్రలో మాదిరిగానే దోపిడీ మొదలైందని మాజీ మంత్రి గుంతకండ్ల జరగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అదేందని అడిగిన వారిపై ఎదురుదాడికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనుభవం లేదని కేసీఆర్ ఏదైనా చెబితే పాజిటివ్‌గా తీసుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ లక్ష మందితో సభపెడితే కృష్ణ జలాలపై శాసనసభలో తీర్మానం చేశారని చెప్పారు. బనకచర్లపై కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎదిరించి ఉద్యమం చేపడతామంటే దిగి వచ్చారని అన్నారు. కృష్ణా నదికి చంద్రబాబు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నడని, ఇరిగేషన్ మంత్రి అవగాహన లోపంతో, తెలివి తక్కువ తనంతో 40 టీఎంసీలకు ఒప్పుకొని ఉత్తరం రాసిండని చెప్పారు.
90 టీఎంసీల నీటిని మహబూబ్‌నగర్ రంగారెడ్డిలకు అందించేందుకు గతంలో 27 వేల కోట్లు ఖర్చుపెట్టామని, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయకుండా 40 టీఎంసీలకు ఒప్పుకుని మహబూబ్‌నగర్ రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేసిండ్రని జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గంటపాటు నీళ్లపై జరుగుతున్న అన్యాయాన్ని వివరించాడని, ఎవరిపై విమర్శ చేయలేదని చెప్పారు. చంద్రబాబు, నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నరని ఆరోపించారు.
మోడీ, చంద్రబాబులు రేవంత్‌రెడ్డి అవసరమని, ప్రజలకు అవసరం లేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. మోదీ, చంద్రబాబుల కోసం ప్రజల గొంతు ఎండబెడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్.. ప్రభుత్వం తోలు తీస్తా అన్నారని, స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ గురించి తాము కూడా నోటికొచ్చినట్లు మాట్లాడగలమని, కానీ ఆ భాషను తాము మాట్లాడమని అన్నారు. రేవంత్ రెడ్డిది కంపు నోరని, మురికి కాలువ కంపు కంటే అద్వాన్నమని విమర్శించారు.
రేవంత్‌ది ఏ కోశాన కూడా కేసీఆర్ స్థాయి కాదని జగదీశ్‌రెడ్డి అన్నారు. రేవంత్ కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే మాటలు మాట్లాడుతున్నడని విమర్శించారు. ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని మాట్లాడాలని, సాధారణ ఎన్నికలు వస్తే ప్రజలే రేవంత్ రెడ్డిని బండరాళ్లు కట్టి మున్సిపల్ చెత్త పారేసినట్లు మూసిలో పడవేస్తరని అన్నారు. కేసీఆర్‌కు సమాధానం చెప్పలేక బూతు మాటలు మాట్లాడుతుండని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజల్లోకి వస్తుంటే భయం ఎందుకు..? దమ్ముంటే కేసీఆర్ ప్రశ్నకు సమాధానం చెప్పు అని సవాల్ చేశారు.
నువ్వు, నీ పోలీసులు అధికారులతో ఎన్ని పన్నాగాలు పన్నినా టీఆర్ఎస్ సైనికులు అద్భుతమైన పోరాటంతో గెలుపొందారని జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ నీ బండారం బయటపెడతాడని బూతులు మాట్లాడుతున్నవ్.. నువ్వు ఎంత దిగజారినా మేం ఆ స్థాయికి రాము’ అని ఎద్దేవా చేశారు. దొంగ రాతలు రాస్తూ కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్న మీకు ప్రజల చేతుల్లో శిక్ష పడుతుందని అన్నారు. రేవంత్‌రెడ్డీ కేసీఆర్ ముందు నీ కుప్పి గంతులు మానుకో అని హెచ్చరించారు.