గోదావరిఖని, ఏప్రిల్ 14: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ నియంత, ప్రజా కంటకపాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంథనిలో రెండ్రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ‘మా పాలనను ఎదిరించినా, మేం చేసే పనులను ప్రశ్నించినా.. అడ్డంగా నరుకుతాం’ అని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ గూండా మాదిరి మాట్లాడటం సరికాదని అన్నారు. ఓట్లేసినందుకు ప్రజలను నరుకుతరా? ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను నరుకుతరా? కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించడం, మాట్లాడటం నేరమని పేర్కొన్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకుబీఆర్ఎస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు సైతం భయపడిపోవడం శోచనీయమని హరీశ్‌రెడ్డి అ న్నారు. రామగుండంలో రాత్రిపూట అధికారులను పంపించి ఇండ్లు కూ లుస్తామని బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యే మాటకు ఎదురుచెబితే చంపుతామని గుర్తుతెలియని వ్యక్తు లు ఫోన్ చేసి భయపెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత వ్యాల్ల హరీశ్‌రెడ్డి వెంట నాయకులు జహిద్పాషా, పోలాడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్, బొబ్బిలి సతీశ్ తదితరులు ఉన్నారు.