బోడుప్పల్, ఆగస్టు 22 : ‘ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రజలకు రక్షణగా ఉండే 22-ఏ చట్టం ప్రజలను భక్షించే చట్టంగా మారింది. ఈ చట్టంపై స్పష్టత వచ్చేవరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నేత మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ సర్కిల్-10 పరిధిలోని హేమానగర్, లక్ష్మీగణపతి కాలనీవాసులు హరీశ్‌రావును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజల ఆస్తులపై విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని వారు హరీశ్‌రావును కోరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉటుందని హామీ ఇచ్చారు. నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూముల హక్కులను కాలరాసే ధైర్యం ప్రభుత్వానికి ఎవరిచ్చారని మండిపడ్డారు.
ప్రభుత్వ భూముల రక్షణకు ఉద్దేశించి రూపొందించిన చట్టం 22-ఏ ప్రజల హక్కులను కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. సర్వే నంబర్ 215లో గత 30 ఏండ్లుగా ఎలాంటి వివాదాలకు తావులేకుండా జీవనం కొనసాగిస్తున్న సామాన్యులపై ప్రభుత్వ అర్బన్ సీలింగ్ ల్యాండ్ కింద 22-ఏ జాబితాలో చేర్చి వారి జీవితాలతో ఆడుకుంటున్నదని విమర్శించారు. హక్కుదారులను సమాచారం లేకుండా లాక్కొనే చట్టమేందని మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మంద సంజీవరెడ్డి, కాలనీ ప్రతినిధులు సంతోష్‌రెడ్డి, గోపి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పిల్లల పెండ్లీలకు, కష్టమొస్తే సొంత ఆస్తులను విక్రయించుకునే హక్కులేకుండా చేసిన ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మీసాల కృష్ణ, చక్రపాణిగౌడ్, కుమార్, స్వామి, శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్, శ్రీనివాస్‌రెడ్డి, గోపి, ఉప్పరి విజయ్ సహా పలువురు హేమానగర్, లక్ష్మీగణపతి కాలనీవాసులు పాల్గొన్నారు.
నిషేధిత జాబితా (22ఏ) పేరిట ప్రజల భూములు, ఆస్తులు కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారని రాష్ట్ర సర్కార్‌ను బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ టీ హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ ముసుగులో సాగిస్తున్న దుర్మార్గాలను శనివారం ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడో.. బిడ్డల పెండ్లిళ్లకో ఇల్లో, భూమో అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే, ప్రొహిబిషన్‌లో ఉందని అధికారులు చెప్తుండటంతో బాధితులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇండ్లు, ఆస్తులను అడ్డం పెట్టుకొని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకొనేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీగణపతి, హేమనగర్ కాలనీలకు చెందిన వందలాది మంది 22 ఏ బాధితులు వచ్చి ఆవేదనకు గురవుతుంటే తన గుండె తరుక్కుపోయిందని పేర్కొన్నారు.