Harish Rao | 1956లో కుట్రలు చేసి సమైక్యాంధ్రలో తెలంగాణను విలీనం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆనాటి నుంచి తెలంగాణలో ప్రత్యే రాష్ట్ర ఆకాంక్ష అలాగే ఉన్నదని పేర్కొన్నారు. జయశంకర్ సార్ జీవితమంతా తెలంగాణ సిద్ధాంత ప్రచారానికే అంకితం చేశారని గుర్తుచేశారు. సిద్దిపేటలో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ లాంటి వాళ్లు ఎవరో రాకపోతారా అని ఎదురుచూశారని తెలిపారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ ఇస్తామని కనీస ఉమ్మడి కార్యక్రమంలో రాస్తేనే కేంద్రంలో చేరతామని కేసీఆర్ ఆనాడు షరతు పెట్టారని హరీశ్‌రావు గుర్తుచేశారు. సంప్రదింపుల ద్వారా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రపతి నోట తెలంగాణ మాట చెప్పించారని అన్నారు. తనకు కేంద్రమంత్రి పదవి అవసరం లేదని.. తెలంగాణనే కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కానీ సోనియాగాంధీ పట్టుబట్టడంతో కేసీఆర్ కేబినెట్లో చేరారని తెలిపారు. కానీ కేసీఆర్‌కు ఇచ్చిన బొగ్గు శాఖను డీఎంకే అడిగితే ఇచ్చేశారని పేర్కొన్నారు. ఏ శాఖ లేకుండానే కేసీఆర్ 8 నెలల పాటు కేంద్రమంత్రిగా ఉన్నారని తెలిపారు. తనకు ఏ శాఖ అవసరం లేదని.. తెలంగాణ ఇస్తే చాలని కేసీఆర్ పట్టుబట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు.
ఆనాడు వైఎస్ కుట్రలు చేసి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకున్నారని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రా ప్రజలను వైఎస్ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. అప్పుడు టీడీపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుని చంద్రబాబుతో జై కొట్టించారని అన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ మళ్లీ మోసం చేసిందని.. బీజేపీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని మోసం చేసిందని తెలిపారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అని కేంద్రం చెప్పిందని తెలిపారు. ఫ్రీ జోన్ అంటే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుందని కేసీఆర్ ఒప్పుకోలేదని తెలిపారు. దీంతో 2009 అక్టోబర్ 12వ తేదీన సిద్దిపేటలో ఉద్యోగ గర్జన సన్నాహక సభ ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని కేసీఆర్ నినదించారని గుర్తుచేశారు. అక్టోబర్ 21న ఉద్యమ గర్జన అద్భుతంగా జరిగిందని తెలిపారు. నవంబర్ 29న ఆమరణ దీక్ష చేస్తానని కేసీఆర్ ఆనాడు ప్రకటించారని చెప్పారు. అప్పుడు వేల మంది పోలీసులు మోహరించి దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారని.. రోజూ ఏదో ఒక సాకుతో టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టారని, అరెస్టులు చేశారని అన్నారు. కేసీఆర్‌ను అలుగునూరు చౌరస్తా దగ్గర అరెస్టు చేసి ఖమ్మం తరలించారని తెలిపారు. ఆంధ్రా బార్డర్ ఖమ్మంలో ఉద్యమం ఉండదని అనుకున్నారని పేర్కొన్నారు. కానీ న్యాయవాదులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉప్పెనలా లేచారని గుర్తుచేశారు.
తాము సిద్దిపేటలో వేల మందితో దీక్షకు దిగితే తోడేళ్ల మందలా పోలీసులు మీద పడ్డారని హరీశ్‌రావు తెలిపారు. కానీ గాంధీజీ తరహాలో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసిందని తెలిపారు. డిసెంబర్ 3న కేసీఆర్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారని గుర్తుచేశారు. కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో దీక్ష విరమించాలని కోరామన్నారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకుంటే.. కేసీఆర్ శవయాత్ర అని అన్నారని చెప్పారు. కేసీఆర్‌కు ఏమైనా అయితే తెలంగాణ అగ్నిగుండంలా అయితుందని కేంద్రం భయపడిందని అన్నారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే దీక్ష విరమిస్తానని కేసీఆర్ అన్నారని చెప్పారు. దీంతో తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిందని వెల్లడించారు. జయశంకర్ సార్ రాసిన ప్రకటనను కేంద్ర మంత్రి చదివి వినిపించారని అన్నారు. డిసెంబర్ 9న గొప్ప పండుగలా చేసుకున్నామని తెలిపారు.
ఇచ్చిన తెలంగాణను డిసెంబర్ 23న కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకుందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణలో మొత్తం మళ్లీ ఉద్యమం ఉవ్వెత్తున మొదలైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అప్పుడు రాజీనామా చేయకుండా రేవంత్ రెడ్డి పారిపోయిండని విమర్శించారు. ఇప్పటి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయలేదని తెలిపారు. ఎంపీగా కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారని అన్నారు. డిసెంబర్ 24న సిద్దిపేటలో దీక్ష ప్రారంభించి 1531 రోజులు నడిపించామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యే వరకు సిద్దిపేటలో దీక్ష కొనసాగించామని అన్నారు.