Harish Rao | కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎన్ఎంసీ చైర్మన్ అభిజాత్ సేఠ్‌కు లేఖ రాశారు. ప్రతిష్టాత్మకమైన కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడం అత్యంత శోచనీయమని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలి కాలంలో కాళోజీ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన పరిణామాలు వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి, రేవంత్ రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనమని అన్నారు. మహాకవి శ్రీశ్రీ గారు “కాదేదీ కవితకు అనర్హం” అంటే.. రేవంత్ రెడ్డి “కాదేదీ స్కాంకు అనర్హం” అని చెప్పడంతో పాటు చేసి చూపిస్తున్నారని విమర్శించారు.
‘ వైద్య విద్య మార్కుల రీ-వాల్యుయేషన్ ప్రక్రియపై కొద్ది రోజులుగా వరుసగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నట్లు? పీజీ వైద్య పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు, కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారు? ఈ అక్రమాల వెనుక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. నందకుమార్ రెడ్డి సూత్రధారి అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందినవారే కావడం, వైస్ ఛాన్స్లర్ ఆ కాలేజీలతో ఎన్ని కోట్ల రూపాయల డీల్ చేసుకున్నారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాళోజీ యానివర్సిటీ స్కాం విషయంలో వీసీ వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది? ఈ స్కాం వాస్తవాలు వెలుగు చూడకుండా, వీసీ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? రీ-కౌంటింగ్ తర్వాత ఓ విద్యార్థి పాస్ కావడం కాళోజీ విశ్వవిద్యాలయ చరిత్రలోనే మొదటిసారి కావడం, ఇది నిబంధనల ఉల్లంఘనకు స్పష్టమైన ఉదాహరణ. ‘ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
‘ విశ్వవిద్యాలయ నిబంధనలు, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఈ అక్రమాలు జరగడం వైద్య విద్యా వ్యవస్థకు మాయని మచ్చ. విశ్వవిద్యాలయం, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం రీ-కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ రీ-వాల్యుయేషన్ చేయడం అనేది అక్రమం. పరీక్షలు ముగిసిన తర్వాత వైస్ ఛాన్స్లర్ స్వయంగా సమాధాన పత్రాల్లోని క్రాస్ మార్క్ ఉన్న పేజీల్లో విద్యార్థులతో సమాధానాలు రాయించి, తిరిగి మూల్యాంకనం చేయించి, ఎక్కువ మార్కులు వేయించి ఐదుగురిని పాస్ చేయించారని అందులో ఒక విద్యార్థి విజిలెన్స్ విచారణలో స్పష్టంగా వెల్లడించాడు. పీజీ వైద్య పరీక్షలను సజావుగా నిర్వహించడంలో వైస్ ఛాన్స్లర్ పూర్తి వైఫల్యం చెందారు. సమర్థవంతమైన అధికారులకు అవకాశం కల్పించకుండా రాజకీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల యూనివర్సిటీ ఖ్యాతి రోడ్డున పడింది. ఈ మొత్తం తతంగంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు స్పష్టమవుతోంది. ఇది ఒక్క కాళోజీ విశ్వవిద్యాలయానికి సిగ్గుచేటు మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత నీచమైన ఘటనగా నిలుస్తుంది. ‘ అని హరీశ్‌రావు అన్నారు.
‘ అసలు రీ-వాల్యుయేషన్ చేసే అధికారం వైస్ ఛాన్స్‌లర్‌కు ఎవరు ఇచ్చారు? సమాధాన పత్రాలను తిరిగి విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు రాయించమని వీసీకి చెప్పినవారు ఎవరు? ఫెయిల్ అయిన వారిని పాస్ చేయాలని ఆదేశించినవారు ఎవరు? ఆరోగ్య శాఖ నియమించిన కమిటీ అవకతవకలను గుర్తించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ స్కాంలో ప్రభుత్వం కాపాడుతున్న ఆ పెద్ద మనిషి ఎవరు? ఇది మాత్రమే కాదు ఎంబీబీఎస్ పరీక్షలలో కూడా కొందరు అక్రమంగా పాస్ అవడం, మాన్యువల్ మార్కుల సవరణలు, సర్వర్ మార్పులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై విద్యార్థులు ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తుంది? కాళోజీ వర్సిటీ కేంద్రంగా జరుగుతున్న స్కాంలు బయటపడతాయనే భయమా? ప్రతిష్టాత్మకమైన కాళోజీ విశ్వవిద్యాలయ పరీక్షా వ్యవస్థ పూర్తిగా అక్రమాలకు నిలయంగా మారడం దురదృష్టకరం, ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అర్హత లేని విద్యార్థులను వైద్య విద్యలో అడ్డదారిలో పాస్ చేస్తే ప్రజల ప్రాణాలు తీస్తారు.. అది ఎవరిది బాధ్యత? కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం.’ అని హరీశ్‌రావు విమర్శించారు.
‘ వైస్ ఛాన్సలర్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఫేక్ ఇన్స్పెక్షన్లు, వైద్య, నర్సింగ్ కాలేజీల నుండి భారీ మొత్తాలు వసూలు చేయడం వంటివి ప్రతికల ద్వారా వెలుగు చూస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తక్షణం చర్యలు తీసుకోవాలి’ అని గవర్నర్, NMC చైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డిని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తి విచారణ జరపాలన్నారు. వీసీకి అండగా ఉన్న రాజకీయ పెద్దలెవరో బహిర్గతం చేయాలని కోరారు. ఆరోగ్య శాఖ, విజిలెన్స్ శాఖ దర్యాప్తు నివేదికలను బయట పెట్టాలన్నారు. ఎంబీబీఎస్, పీజీ పరీక్షల మోసాలు, మార్కుల రీ-వాల్యుయేషన్, సర్వర్ మార్పులు మొదలైనవాటిపై పూర్తి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Harishrao Letter1

Harishrao Letter2

Harishrao Letter3