BRS Leader Harish Rao | రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సాయం పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతన్నను మరోసారి దగా చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత టీ హరీశ్ రావు ఆరోపించారు. నమ్మించి గొంతు కోసిన రేవంత్ సర్కార్కు తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని అన్నారు. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రూ.15000 ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
`2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడైతే రూ.10,000, మాకు ఓటేస్తే రూ.15,000 అని ఊరించిండు. నమ్మించి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారు. గద్దెనెక్కినాక గద్దల్లాగా మారి రైతులను దారుణంగా వంచిస్తున్నారు. ఈరోజు జరిగిన క్యాబినెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆశలను అడియాసలు చేసింది. రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారు` అని హరీశ్ రావు అన్నారు.
`రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో ఎకరానికి రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి, రూ.6,000లకు కుదించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట. మోసానికి పర్యాయపదం రేవంత్ రెడ్డి అనేది ఈరోజు నగ్నంగా బయటపడింది. కేసీఆర్ మానస పుత్రిక, ప్రపంచమే మెచ్చిన రైతుబంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈరోజు క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది` అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
`భూమి కలిగిన రైతులకే కాదు, కౌలు రైతులకు సైతం రెండు సీజన్లలో కలిపి ఎకరాకు రూ.15,000 పంట పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రమాణం చేశారు. క్యాబినెట్ లో ఆ విషయమే చర్చించలేదు. కౌలు రైతుల గుండెలపై గుద్దారు. దారుణంగా ధోకాకు పాల్పడ్డారు. వానా కాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితోపాటు కలిపి ఎకరానికి రూ.15,000 చొప్పున చెల్లించాలి` అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
`రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టడం ద్వారా అదొక చిల్లర నాటకంగా మార్చేశారు. బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోగస్ గానే మిగిలిపోయింది. పంట బీమా పత్తా లేకుండా పోయింది. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరు. నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో బుద్ధి చెబుతారు` అని హరీశ్ రావు స్పష్టం చేశారు.