Harish Rao : చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారించడం ముగిసిందని సిట్ చీఫ్, సీపీ సజ్జనార్ ఆదివారం రాత్రి ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేసుపై విచారణ జరుగుతుండగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అధికారికంగా ‘చట్టవిరుద్ధం’ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటన చట్టవ్యతిరేకమైనదేగాక, ఆందోళనకరమైనదని పేర్కొన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో హరీష్‌రావు ఒక పోస్టు పెట్టారు.
రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం తీర్పు చెప్పేవరకు ఏ ఆరోపణను నేరంగా పరిగణించలేమనేది చట్టపరంగా ఒక స్థిరమైన సూత్రంమని హరీష్‌రావు తన పోస్టులో గుర్తుచేశారు. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఈ విషయం చెబుతోందని తెలిపారు. పోలీసులకు దర్యాప్తు బాధ్యత మాత్రమే అప్పగించబడిందని, విచారణ దశలో ఏదైనా చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించడానికి పోలీసులు న్యాయమూర్తులో లేదా న్యాయనిర్ణేతలో కాదని పేర్కొన్నారు.
ఏదైనా ఫోన్ సంభాషణలో తలదూర్చడం చట్టబద్ధమైనదా లేదా చట్టవిరుద్ధమా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, PUCL vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన రక్షణలు స్పష్టం చేస్తాయని హరీశ్‌రావు తెలిపారు. ఇలాంటి విషయాలను అధికారిక పోలీసు కమ్యూనికేషన్ల ద్వారా కాకుండా న్యాయపరమైన పరిశీలన ద్వారా మాత్రమే నిర్ణయించాలనేది నిబంధన అని గుర్తుచేశారు.
సిట్ చీఫ్ సజ్జనార్ తన అధికారిక సందేశంలో ‘చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్’ అనే వ్యక్తీకరణను ఉపయోగించడం ద్వారా దర్యాప్తు ఫలితాన్ని ముందే నిర్ధారించుకున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోందని అభిప్రాయపడ్డారు. సజ్జనార్ తీరు ఆయన పదవికి తగినది కాదని, 1968 నాటి అఖిల భారత సర్వీసుల నియమాల ప్రకారం నిర్దేశించిన తటస్థత, నిగ్రహం ప్రమాణాలకు విరుద్ధమని విమర్వించారు. సీనియర్ అధికారులకు ఇలాంటి విషయాల్లో పూర్తి నిష్పాక్షికత, సమగ్రత అవసరమని చెప్పారు.
ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో సంబంధం కలిగిన.. రాజకీయంగా సున్నితమైన విషయంలో ఇలాంటి అనుచిత తీర్మానాలు.. రాజకీయ ప్రేరేపిత, పక్షపాతపూరితమైన దర్యాప్తు జరుగుతున్నట్లుగా అనుమానాలు కలిగిస్తాయని తెలిపారు. దర్యాప్తులు న్యాయంగా ఉండాలని, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం అత్యంత ముఖ్యమైనదని, న్యాయంగా కనిపించాలని సుప్రీంకోర్టు పదేపదే పేర్కొన్నది గుర్తుచేశారు.
సిట్ అధిపతి స్థాయి వ్యక్తి విచారణకు ముందే నేరాన్ని అంగీకరించే భాషను వినియోగించినప్పుడు అది ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తుందని, చట్టబద్ధమైన పాలనపై విశ్వాసాన్ని క్షీణింపజేస్తుందని హరీష్‌రావు పేర్కొన్నారు. అధికారిక పోలీసు సమాచారంపై పక్షపాత వైఖరి చూపడం, రాజకీయం చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, కచ్చితంగా చట్ట పరిధిలో పనిచేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
తీర్పులను పోలీసు సందేశాల ద్వారా కాకుండా కోర్టుల ద్వారా ఇవ్వాలని హరీష్‌రావు సూచించారు. సంస్థలు తమ రాజ్యాంగ పరిమితులను మీరితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదని పేర్కొన్నారు. సిట్ చీఫ్ సజ్జనార్.. కేసీఆర్‌గారిని గౌరవనీయ ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించడం లేదో తెలుసుకోవాలని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ఆయన తన పోస్టును ముగించారు.