T Harish Rao | విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించి, అత్యున్నతమైన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన డాక్టర్ డీఎన్ రెడ్డి వైద్య రంగంలో సుధీర్ఘ కాలంగా విశిష్ట సేవలందిస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ పేషంట్లకు బాలకృష్ణ వైద్య సేవలందిస్తున్నారని కొనియాడారు.
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులుగా, అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. పద్మశ్రీకి ఎంపికైన మాడుగుల నాగఫణి శర్మ తన ప్రవచనాలు, రచనలతో సమాజాన్ని జాగృతం చేస్తూ, మేలుకొలుపుతున్నారని వెల్లడించారు. వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారిని గుర్తించి, పద్మ అవార్డులకు ఎంపిక చేయడం సంతోషించతగిన విషయం అని హరీశ్ రావు పేర్కొన్నారు.