గురుకులాలు, హాస్టళ్లలో కొనసాగుతున్న విద్యార్థుల చావులు, ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేస్తున్న హత్యలేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో దేశానికే దిక్సూచీగా నిలిచిన తెలంగాణ గురుకులాలు, కాంగ్రెస్ ఏడాది పాలనలోనే పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురుకులాలు, హాస్టళ్లల వరుసగా ఫుడ్‌పాయిజన్ ఉదంతాలు, పలుచోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి, పర్యవేక్షణ కొరవడడమే కారణమని మండిపడుతూ మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌ను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగ బాలు మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచీ విద్యావ్యవస్థ దశాబ్దకాలం వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సుమారు 52మంది విద్యార్థులు మృతిచెందారని, అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని నిప్పులు చెరిగారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ, సంక్షేమశాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నా నేటికీ స్పందించకపోవడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్షేమ హాస్టళ్లపై నమ్మకం పోతున్నదని, పిల్లల జీవితాలపై ఆందోళన చెందుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగడుతూ, వరుస సంఘటనలపై త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ పర్యటిస్తుందని తెలిపారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా అన్నివసతులు అందిస్తూ మెరుగైన విద్యను పేద వర్గాలకు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించేంత వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగ బాలు హెచ్చరించారు.