Gadari Kishore | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఘాటుగా స్పందించారు. విద్యార్థులను, నిరుద్యోగులను సన్నాసులని రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు.. ఆ రోజు రాహుల్ గాంధీ సన్నాసా? రేవంత్ రెడ్డి సన్నాసా? అని గాదరి కిశోర్ నిలదీశారు. తెలంగాణ భవన్లో గాదరి కిశోర్ మీడియాతో మాట్లాడారు.
ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పరమైన ఇబ్బందులు ఉంటే కారణాలు చెప్పి నిరుద్యోగులను ఒప్పించే ప్రయత్నం చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత. అది చేయకుండా దమనకాండను సృష్టించే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియాలోకి పోలీసులు అడుగు పెట్టలేదు. ఒక్కసారి మాత్రమే పోలీసులు చొరబడి, వికృత చర్యలకు పాల్పడితే ఆ రోజు ఉద్యమ తీవ్రతను గమనించిన హైకోర్టు జోక్యం చేసుకోని క్యాంపస్‌లోకి పోలీసులు వెళ్లొద్దని ఆదేశించింది. ఉద్యమ రోజులను తలదన్నే విధంగా మళ్లీ నిన్న వికృత చేష్టలతో పోలీసులు విద్యార్థులను ఇబ్బంది పెట్టారు అని గాదరి కిశోర్ పేర్కొన్నారు.
టెట్ నిర్వహించిన తర్వాత 45 రోజుల సమయం ఇవ్వండి. మారిన సిలబస్‌ను చదవుకోవడానికి 25 రోజుల సమయం సరిపోదు. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు వేడుకుంటున్నారు. దాంతో పాటు ఎస్జీటీలు పదోన్నతులు పొందడంతో మరో 9 వేల పోస్టులు ఖాళీగా ఏర్పడ్డాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన 5 వేలకు మరో 6 వేలు కలిపి 11 వేలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది. ఇప్పుడు డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్ ఏంటంటే.. ఎస్జీటీలు పదోన్నతులు పొందగా మిగిలిన 9 వేల పోస్టులను కలిపితే 20 వేలు అవుతాయి. 11 వేలతో మెగా డీఎస్సీ కాదు.. 20 వేలతో వేస్తే మాకు లాభం జరుగుతది అని అభ్యర్థులు అంటున్నారు. 25 వేలతో మెగా డీఎస్సీ వేస్తానని చెప్పిన రేవంత్.. ఇప్పుడు 20 వేలతో మెగా డీఎస్సీ వేయొచ్చు కదా..? అని గాదరి కిశోర్ నిలదీశారు.
నిరుద్యోగులను అవహేళన చేసుకుంటూ అసభ్యకరంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. నిన్న ఓయూలో వందల మందిని అరెస్టు చేసి కరెంట్ తీసేసి చిత్రహింసలు పెట్టారు. ప్రజా పాలన అని మాట్లాడే రేవంత్ ఏం చేస్తున్నాడు. రేపట్నుంచి హాల్ టికెట్ ఇస్తామంటున్నారు.. ఎందుకంటే ఉద్యోగాలు అమ్ముకున్నాడు. ఫిక్స్ అయిపోయింది. వాయిదా వేస్తే ఇబ్బంది అయితదని. అమ్ముకున్న ఉద్యోగాలకు వసూళ్లు చేయాలి.. కప్పం కట్టాలి కాబట్టి ఇబ్బంది అయితదని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతా అని రేవంత్ రెడ్డి అంటున్నారు అని కిశోర్ మండిపడ్డారు.
నిన్న మహబూబ్‌నగర్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులను అందర్నీ అవమానించే విధంగా సన్నాసులు వాయిదా వేయమంటున్నారు. చదవు రానోళ్లు ఆందోళన చేస్తున్నరు అని మాట్లాడుతున్నారు అవమానకరంగా. సన్నాసులట.. మరి నువ్వు నిరుద్యోగుల కోసం రాహుల్‌ను అశోక్‌నగర్‌లో తిప్పినప్పుడు ఎవరు సన్నాసి. నిరుద్యోగుల ఆర్తనాదాలు 9 ఏండ్ల నుంచి వినబడుతలేవా.. గ్రూప్-1 వాయిదా వేయాలని రేవంత్ ట్వీట్ చేశారు కదా.. మరి ఎవరు సన్నాసి అని గాదరి కిశోర్ నిలదీశారు.